ప్రముఖ సీనియర్ నటుడు, రచయిత, సాహితీవేత్త రావి కొండలరావు ఇకలేరు. గుండె పోటుతో ఆయన బేగంపేటలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎన్నో చిత్రాలకు రచయితగా, నటుడిగా ఆయన ప్రస్థానం అనన్యసామాన్యం. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో జన్మించిన రావి కొండలరావు వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు. నాటికలు, నాటకాలు కూడా రచించారు.
తెలుగు చలనచిత్ర చరిత్రలో అరవై సంవత్సరాల సుదీర్ఘకాలం సినిమాలలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు తర్వాతి స్థానం బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావుకు దక్కడం విశేషం. అంతేకాదు తన సహధర్మచారిణి రాధాకుమారితో కలిసి వంద సినిమాలలో భార్యాభర్తలుగా నటించిన ప్రపంచ రికార్డు కూడా వీరికే దక్కుతుంది. గత అరవై సంవత్సరాలుగా తెలుగు సినిమాకు అంకితమై, హాస్యానికి మాత్రమే పరిమితం కాకుండా ఆరు వందలకు పైచిలుకు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ఆయన చలనచిత్ర షష్టిపూర్తి జరుపుకున్నారు. రావి కొండలరావు. ఆయన లేని లోటు తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటు. ఆయన మృతికి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.