విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా.యన్టీఆర్ నటించిన సూపర్ హిట్ ఫ్యామిలీ అండ్ సెంటిమెంట్ డ్రామా ‘చిట్టిచెల్లెలు’. ఎన్నో చిత్రాల్లో సూపర్ జోడీ గా నటించి మెప్పించిన యన్టీఆర్, వాణీశ్రీ అన్నచెల్లెళ్ళు గా నటించిన ఈ సినిమా 1970, జూలై29న విడుదలైంది. సరిగ్గానేటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఏ.వీ.యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై యమ్. కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్నాచెల్లెల్ల అనురాగానికి అపూర్వ రూపకల్పన . రాజశ్రీ కథానాయికగా నటించగా.. హరనాధ్, రాజశ్రీ, గుమ్మడి, పద్మనాభం తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
మాతృప్రేమను మించినది లోకంలో లేదంటారు. కాని చెల్లెలి పట్ల అన్న ప్రేమానురాగాలు అంతకంటే తక్కువేమి కాదని నిరూపించిన చిత్రం ‘చిట్టిచెల్లెలు’. అన్న పాత్రలో ఎన్.టి.ఆర్. సోదరి పట్ల వాత్సల్యాన్ని అత్యంత సహజంగా కదిలించేలా ప్రదర్శించగా, చెల్లెలి పాత్రలో వాణిశ్రీ అన్నపట్ల అనురాగం చూపించే చెల్లిలిగా తన నటనను ప్రదర్శించింది. ఇక సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పనలో రూపు దిద్దుకొన్న పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. అందులో ముఖ్యంగా అందాల పసిపాప , ఈ రేయి తీయనిది పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.