ఆయన కంఠం కంచు. డైలాగ్స్ ను డైనమైట్స్ లా పేల్చడంలో ఆయనకు ఆయనే సాటి. డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ, హీరోగానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ… విలన్ గానూ ఇటు తెలుగు, అటు కన్నడ ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు ఆయన. పేరు సాయికుమార్. అగ్ని అంటూ కళ్ళెర్రచేసి నాలుగో సింహంలా పంజావిసిరిన ఆయన కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది తెరపై తన విలక్షణతను చాటుకుంటున్నారు. దక్షిణాది తెరకు డబ్బింగ్ కింగ్ ఆయనే.
ప్రముఖ నటుడు, డబ్బింగ్ కళాకారుడైన పి.జె.శర్మ, కృష్ణజ్యోతి దంపతులకి జన్మించిన సాయికుమార్ ఎమ్.ఎ వరకు చదువుకొన్నారు. కాలేజీలో ఎన్.సి.సి విద్యార్థి అయిన సాయికుమార్, చదువు పూర్తయ్యాక నటనపై దృష్టిపెట్టారు. తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ మొదట డబ్బింగ్ ఆర్టిస్టుగానే ప్రయాణం మొదలుపెట్టారు సాయికుమార్. సుమన్, రాజశేఖర్‌లకి గళం అందించారు. ‘పోలీస్ స్టోరీ’ చిత్రంతో కన్నడలో కథానాయకుడిగా ఘన విజయాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో కూడా అనువాదమై విశేష ఆదరణని చూరగొంది. ఆ తర్వాత ఆయనకి కన్నడ నుంచి అవకాశాలు వెల్లువెత్తాయి. ‘అగ్ని ఐపీఎస్’, ‘కుంకుమ భాగ్య’, ‘పోలీస్ స్టోరీ2’, ‘లాకప్ డెత్’, ‘సర్కిల్ ఇన్‌స్పెక్టర్’, ‘సెంట్రల్ జైల్’, ‘పోలీస్ బేటే’, ‘మనే మనే రామాయణ’ చిత్రాలతో కన్నడలో స్టార్ హీరోగా ఎదిగారు. ఇటీవల ‘రంగి తరంగి’తోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నారు. తెలుగులో బాపు దర్శకత్వం వహించిన ‘స్నేహం’తో నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకొన్నారు. ఆతర్వాత ఆయనకి వరుసగా అవకాశాలు వచ్చాయి. పలు చిత్రాల్లో ప్రతినాయకుడిగా, సహ నటుడిగా మెరిసి ప్రేక్షకులకు చేరువయ్యారు. టెలివిజన్‌లో పలు కార్యక్రమాలకి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించి ఇంటింటికీ చేరువయ్యారు. ‘సామాన్యుడు’తో ఉత్తమ విలన్‌గా నంది పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు. ‘ప్రస్థానం’తో ఉత్తమ సహనటుడిగా నంది అందుకొన్నారు. సాయికుమార్ తమ్ముళ్లు పి.రవిశంకర్, అయ్యప్ప.పి.శర్మలు కూడా నటులుగా, డబ్బింగ్ కళాకారులుగా కొనసాగుతున్నారు. సురేఖని వివాహం చేసుకొన్న సాయికుమార్‌కి ఇద్దరు సంతానం. తనయుడు ఆది కథానాయకుడిగా కొనసాగుతుండగా, తనయ జ్యోతిర్మయి వైద్య వృత్తిలో ఉన్నారు. నేడు సాయికుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా డైలాగ్ కింగ్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.