మాస్ ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఆయనకు ఫ్రేమ్ తో పెట్టిన విద్య. ఎలాంటి కథనైనా సరే కమర్షియల్ కోణంలో ఎలివేట్ చేయడం ఆయన లక్షణం. అలాగే.. సెంటిమెంట్ ను కూడా సమాంతరంగా నడిపించి… ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకోవడం ఆయన నైజం. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా హీరోయిజాన్ని హై ఓల్టేజ్ లో బిల్డ్ చేసి అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇవ్వడం ఆయన తత్వం. ఆ దర్శకుడు పేరు బి.గోపాల్. టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఫ్యాక్షన్ మేనియాతో ఊపేసిన ఆయన .. అందరు అగ్రకథానాయకులతోనూ వర్క్ చేసి .. అందరికీ సూపర్ హిట్స్ ఇచ్చారు.
బి.గోపాల్ అసలు పేరు బెజవాడ గోపాల్. ప్రకాశం జిల్లా, టంగుటూరు దగ్గర ఎమ్.నిడమర్రు లో జన్మించిన బి.గోపాల్ కారుమంచిలో విద్యాభ్యాసం చేశారు. ఒంగోలులోని సి.ఎస్.ఆర్‌శర్మ కాలేజీలోనూ చదువుకొన్నారు. తండ్రి అంగీకారంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన పి.సి.రెడ్డి దగ్గర సహాయ దర్శకుడిగా చేరారు. అక్కడ రెండు చిత్రాలు చేసిన అనంతరం ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దగ్గర ‘అడవిరాముడు’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. 12 యేళ్లపాటు ఆయన దగ్గరే ‘దేవత’, ‘జస్టిస్ చౌదరి’, ‘అగ్ని పోరాటం’ తదితర చిత్రాలకి పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు దృష్టిలో పడిన బి.గోపాల్ ఆయన సంస్థలో, ‘ప్రతిధ్వని’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ తెరకెక్కించి విజయాన్ని అందుకొన్నారు. ‘రక్తతిలకం’, ‘విజయ్’, ‘స్టేట్‌రౌడీ’, ‘లారీడ్రైవర్’, ‘బొబ్బిలిరాజా’, ‘చినరాయుడు’, ‘రౌడీ ఇన్స్పెక్టర్’, , నరసింహనాయుడు, ‘మెకానిక్ అల్లుడు’, ‘కలెక్టర్ గారు’, ‘అడవిలో అన్న’… ఇలా వరుసగా చిత్రాలు తెరకెక్కించారు. మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కించిన ‘వంశీ’, ఎన్టీఆర్‌తో తీసిన ‘అల్లరి రాముడు’, ‘నరసింహుడు’, బాలకృష్ణతో తీసిన ‘పల్నాటి బ్రహ్మనాయుడు’, ప్రభాస్‌తో తీసిన ‘అడవిరాముడు’ చిత్రాలు పరాజయాన్ని చవిచూశాయి. ఆ ప్రభావం బి.గోపాల్ కెరీర్‌పై పడింది. ఇప్పుడు మళ్ళీ బాలయ్య తో ఒక సినిమా చేయబోతున్నరనే వార్తలొస్తున్నాయి. నేడు బి.గోపాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.