సూపర్ స్టార్ కృష్ణ నటించిన రెండో చిత్రం ‘కన్నెమనసులు’. బాబూ మూవీస్ పతాకంపై సి.సుందరం నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు. 1966 లో విడుదలైన ఈ సినిమా సరిగ్గా 54 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కృష్ణతో పాటు రామ్మోహన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సంధ్య,సుకన్య హీరోయిన్స్ గా నటించగా… ప్రసన్నరాణి, గుమ్మడి ,సూర్యకాంతం, కె.వి.చలం ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఆదుర్తి సుబ్బారావు కొత్త వారితో తీసిన తేనెమనసులు సూపర్ హిట్టయిన నేపథ్యంలో అదే కేస్టింగ్ తో కన్నెమనసులు చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తేనెమనసులు రేంజ్ లో కాకపోయినా.. మంచి విజయమే సాధించింది. కె.వి.మహదేవన్ అందించిన సంగీతం ఈ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఈ ఉదయం నా హృదయం పురులు విరిసి ఆడింది పులకరించి పాడింది , ఓ..హృదయం లేని ప్రియురాలా వలపులు రగిలించావు పలుకకా ,ఓహో తమరేనా చూడవచ్చారు చూసి ఏం చేస్తారు ఓ భామా అయ్యో రామా , వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే కలలలో రా రమ్మంటు పిలిచావులే లాంటి పాటలు అప్పటి జనాన్ని ఉర్రూతలూగించాయి. ముళ్లపూడి వెంకటరమణ కథ, మాటలు అందించిన ఈ సినిమా కృష్ణ రెండో చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.