పాత్రలో పరకాయ ప్రవేశం ఎలా చేయాలో… పాత్రను ఎలా ఓన్ చేసుకోవాలో .. ఎలాంటి పాత్రైనా సరే.. దాన్ని తన స్టైల్లోకి ఎలా మార్చుకోవాలో.. నాటి తరం ప్రేక్షకులకు రుచి చూపించారు ఆయన. ముచ్చటగొలిపే ముఖ వర్చస్సు, గంభీరమైన కంఠం.. హుందాతనం ఉట్టిపడే అభినయం.. పాత్రకు సరిపడే ఆంగికం, స్పష్టమైన వాచకం.. ఆయన లక్షణాలు . ఆయనంటే తమిళ ప్రేక్షకులకు ఎనలేని ఆరాధన.. తెలుగు ప్రేక్షకులకూ చెప్పలేని అభిమానం. పేరు శివాజీ గణేశన్. తమిళ ప్రజలు ఆయన్ను నడిగర్ తిలగం అనే బిరుదుతో గౌరవిస్తారు. దాదాపు 300 పైచిలుకు  సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో నటించి మెప్పించారు.

శివాజీ గణేశన్.. నేషనల్ పిక్చర్స్ వారి ‘పరాశక్తి’ ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. చిత్రనిర్మాణం సమయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని చివరికి అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అణ్ణాదురై అండతో సినిమా పూర్తిచేసి మహానటుడిగా ఎదిగారు. శివాజీ ఎక్కువగా కథాబలం ఉన్న చిత్రాల్లో మహానటుల మధ్య నటించి నటనలో వారితో పోటీపడేవారు. తనకంటూ ఒక ప్రత్యేకత కోసం తపించేవారు. అవార్డుల కంటే ప్రజల గుర్తింపే నటుడికి ముఖ్యమైనదని ఎప్పుడూ చెప్తుండేవారు. శివాజీ గణేశన్ ను తెలుగు ప్రేక్షకులూ ఆదరించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు శివాజీ నటించిన చిత్రాలు తెలుగునాట కూడా విడుదలయ్యేవి. తెలుగులో పరదేశి, పెంపుడు కొడుకు, మనోహర, పరాశక్తి, బొమ్మలపెళ్ళి, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, సంపూర్ణ రామాయణం, రామదాసు, భక్త తుకారాం, జీవన తీరాలు, బెజవాడ బెబ్బులి, చాణక్య చంద్రగుప్త, నివురుగప్పిన నిప్పు, విశ్వనాథ నాయకుడు చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. తెలుగులో శివాజీ నటనకు కళావాచస్పతి జగ్గయ్య కంఠం సంపూర్ణత్వాన్ని కలిగించేది. తమిళంలో బి.ఆర్.పంతులు తీసిన ‘కర్ణన్’ చిత్రంలో శివాజీ కర్ణుడి పాత్రలో, ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. ఆచిత్రంలో శివాజీ నటనను చూసి ఎన్టీఆర్ ఆశ్చర్యపోయారు. తర్వాత కాలంలో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రామకృష్ణా సినీ స్టుడియోస్ బ్యానర్ పై నిర్మించిన చాణక్య చంద్రగుప్త చిత్రంలో శివాజీని అలెగ్జాండర్ గా నటింపజేశారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు ప్రేమ్ నగర్ చిత్రాన్ని తమిళంలో శివాజీని హీరోగా పెట్టి ‘వసంత మాళిగై’ పేరుతో రీమేక్ చేసి తమిళ చిత్రరంగంలో సంచలనం సృష్టించారు. దాసరి నారాయణరావు కూడా శివాజీ నటన అంటే చెప్పలేని అభిమానం మూలంగా విశ్వనాథ నాయకుడు చారిత్రాత్మక చిత్రంలో అతనిని నటింపజేశారు.  భారత చిత్రరంగంలో ఎంతో ఎదిగినా ఒదిగివుండే వినమ్రత శివాజీ గణేశన్ లో కనిపిస్తుంది. నేడు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆ నడిగర్ తిలగం కు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!