మెరుపు వేగంతో శరీరాన్ని కదుపుతాడు.. అత్యంత శక్తివంతంగా తన కాళ్ళు, చేతులను విసురుతాడు. కొండనైనా పిండిచేయగల పిడికిలితో ప్రత్యర్ధిని మట్టికరిపిస్తాడు. కళ్ళుమూసి తెరిచే లోగా.. తన పోరాటాన్ని ముగించి.. అవతలివాడిలో దడపుట్టిస్తాడు. అతడి పేరు బ్రూస్ లీ. మార్షల్ ఆర్ట్స్ కే రారాజు అతడు. ఆయుధం లేకుండా ఒట్టి చేత్తో వందమందినైనా ఎదిరించగల సాహసి అతడు. తన పోరాట విన్యాసాలతో ఒకప్పుడు హాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఇన్ స్పిరేషనల్ హీరో అతడు.
వెండితెరపై వెలిగిన కథానాయకుల్లో విలక్షణ చరిత్ర కలిగిన ఒకే ఒక్కడు బ్రూస్‌లీ. కరాటే, కుంగ్‌ఫూ, తైక్వాండోలాంటి పోరాట విద్యలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని తీసుకువచ్చిన బ్రూస్‌లీ నటుడిగా, దర్శకుడిగా, పోరాట వీరుడిగా, వేదాంతిగా ఎదిగాడు. అతడి ముద్ర చెరిగిపోనిది. తండ్రి లీ హోయ్ చుయన్ నటుడు కావడంతో, 1940 నవంబర్ 27న పుట్టిన బ్రూస్‌లీ నెలల వయసులోనే వెండితెరకు పరిచయం అయిపోయాడు. 18 ఏళ్లు వచ్చేసరికల్లా 20 సినిమాల్లో కనిపించాడు. పుట్టింది శాన్ ఫ్రాన్సిస్కోలోనే అయినా, హాంగ్‌కాంగ్ తల్లిదండ్రుల వ్యాపకాల రీత్యా హాంగ్‌కాంగ్‌లోనే ఎదిగి, 18 ఏళ్ల వయసులో ఉన్నత చదువు కోసం అమెరికా వచ్చాడు. అక్కడ యువకులకే కాదు, ప్రపంచ సినిమాలకే మార్షల్ ఆర్ట్స్ నేర్పాడు. ‘ద బిగ్‌బాస్’ , ‘ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ’ , ‘వే ఆఫ్ ద డ్రాగన్’ , ‘ఎంటర్ ద డ్రాగన్’ , ‘గేమ్ ఆప్ డెత్’ సినిమాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గడించాడు. అమెరికాలో సహవిద్యార్థిని లిండా ఎమెరీని 1964లో పెళ్లాడి, బ్రాన్‌డన్ లీ, షానన్ లీలకు జన్మనిచ్చాడు. అనేక అవార్డులను, పురస్కారాలను అంతకు మించి సినీ అభిమానుల ప్రేమాభిమానాలను అందుకున్న బ్రూస్‌లీ 1973 జులై 20 అనూహ్యంగా మరణించాడు. నేడు బ్రూస్ లీ వర్ధంతి. ఈ సందర్బంగా అతడికి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.