బాబూ.. చిట్టీ…. అంటూ విషాదమైన హావభావాలు పెట్టి పొట్టచెక్కలు చేసింది. నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.. రచయితను కాదన్నవాడ్ని రాయితో కొడతా.. అంటూ కామెడీ కవితలతో పగలబడి నవ్వించింది. ఎవరు కనబడితే వారికి తాను చూసిన సినిమా కథను వినిపించి.. నవ్వులు పూయించింది. చూసిన సినిమాలోని హీరోలు చనిపోతే.. కన్నీళ్ళు పెట్టుకొని తల్లితో కలిసి బోరున విలపించి.. భళ్ళున నవ్వించింది. వచ్చీరాని సంగీతంతో .. సాధనచేస్తూ భర్తను వంటవాడ్ని చేసి వినోదం చూసింది. వీటన్నిటినీ తన కామెడీ టైమింగ్ తో సమర్ధవంతంగా పోషించి.. టాలీవుడ్ ప్రేక్షకుల అభిమాన నటీమణి అయింది. ఆవిడ పేరు శ్రీలక్ష్మి. అందుకే తెలుగు తెరకు ఆమె నవ్వుల మాలక్ష్మి అయింది.
సీనియర్ నటుడు, నిర్మాత డా.అమర్నాథ్ కూతురే శ్రీలక్ష్మి, తన తండ్రి అనారోగ్యానికి గురవడంతో కుటుంబానికి అండగా నిలిచేందుకు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదట చాలా చిన్న పాత్రలు చేసిన ఆమె ఆ తరువాత మంచి హాస్యనటిగా గుర్తింపు తెచ్చుకొంది. జంధ్యాల దర్శకత్వం వహించిన ‘రెండు జెళ్ల సీత’తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. కె.విశ్వనాథ్ చిత్రాల్లోనూ శ్రీలక్ష్మి గుర్తుండి పోయే పాత్రలు చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఐదు వందల పైచిలుకు చిత్రాల్లో నటించారు శ్రీలక్ష్మి. ఆ తరువాత టెలివిజన్‌లోనూ పలు ధారావాహికల్లో నటించి పేరు తెచ్చుకొన్నారు. ఈమె తమ్ముడు రాజేష్ కూడా పలు చిత్రాల్లో నటించారు. మేనకోడలు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’లో అనే చిత్రంలో నటిస్తుంది. తమిళం, మలయాళం భాషల్లో కథానాయికగా కొనసాగుతున్నారు. 1981 నుంచి చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న శ్రీలక్ష్మి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.