Shopping Cart 0 items - $0.00 0

యన్టీఆర్ ప్రయోగాత్మక చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’ కి 67 ఏళ్ళు

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డా.యన్టీఆర్ కెరీర్ బిగినింగ్ లో నటించిన ప్రయోగాత్మక చిత్రం పిచ్చిపుల్లయ్య. సోదరుడు త్రివిక్రమరావు తో కలిసి యన్.ఏ.టి సంస్థ స్థాపించి తొలి సారిగా ఈ సినిమాను నిర్మించారు. తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1953, జూలై 17న విడుదలైంది.సరిగ్గా నేటికి 67 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలున్నాయి.

‘పాతాళభైరవి’ చిత్రంలో వీరసాహసికుడిగా నటించి.. ఆ సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకున్న యన్టీఆర్.. ‘పిచ్చిపుల్లయ్య’ లో దానికి పూర్తి భిన్నంగా ఒక అమాయక చక్రవర్తి పాత్రలో నటించడం నిజంగా ప్రయోగమనే చెప్పాలి. ఎవరైనా, అమాయకులు కనిపిస్తే వీడు పిచ్చి పుల్లయ్యలా అమాయకుడురా అని చెప్పుకోవడం ఈ సినిమాతోనే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. టీ.వి.రాజు సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. కృష్ణకుమారి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ఇంకా.. ఛాయాదేవి, గుమ్మడి, అమర్ నాథ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

ఇక కథ విషయానికొస్తే  పుల్లయ్య (ఎన్‌.టి.ఆర్‌) పల్లెటూరి యువకుడు. బస్తీలో జమిందారిణి మనోరమాదేవి (ఛాయాదేవి) ఇంట్లో పనికి కుదురుతాడు. జమిందారిణి సవతి కొడుకు చినబాబు (అమరనాథ్‌), భార్య వసంత (జానకి), ఇంటి దాసి కాంతం (కృష్ణకుమారి) ఆ బంగళాలో ఉంటారు. ఎస్టేట్‌ వ్యవహారాలు నిర్వహించే భూపాలరావు (గుమ్మడి) జమిందారిణితో అక్రమ సంబంధం సాగిస్తూ అకృత్యాలకు అలవాటుపడి ఉంటాడు. ఆ ఇంట్లో పుల్లయ్యని అందరూ అభిమానిస్తూ ఉంటారు.. ఒక్క భూపాలరావు తప్ప. వసంత అంటే గిట్టని భూపాలరావు పుల్లయ్యకు, వసంతకు అక్రమ సంబంధం అంటగట్టి సవతి తల్లి ప్రోద్భలంతో చినబాబు చేతుల మీదుగా ఇంట్లోంచి వెళ్లగొట్టిస్తాడు. గర్భిణిగా ఉన్న వసంతను పుల్లయ్య తన ఊరు తీసుకెళ్లి ఆశ్రయమిస్తాడు. వసంత అక్కడే పురుడు పోసుకుంటుంది. భూపాలరావు అకృత్యాలు తెలుసుకొని అతనికి ఎదురుతిరుగుతుంది జమిందారిణి. అది సహించలేని భూపాలరావు ఆమెపై విషప్రయోగం చేస్తాడు. పని మనిషి కాంతం ఉపాయంతో జమిందారిణిని అపాయం నుంచి బయటపడుతుంది. తను చేసిన నేరాలన్నీ పుల్లయ్య మీదికి నెట్టాలని చూస్తాడు భూపాలరావు. అప్పటికి చినబాబుకి నిజాలన్నీ తెలుస్తాయి. భూపాలరావు నేరాలు రుజువై శిక్ష ఖరారవుతుంది. చినబాబు, వసంతలు తిరిగి కలుసుకుంటారు. పుల్లయ్యకి కాంతంతో పెళ్లవుతుంది. ఈ సినిమా అప్పట్లో అంతగా ఆడకపోయినా.. యన్టీఆర్ నటించిన ప్రయోగాత్మక చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.

Leave a comment

error: Content is protected !!