నట భూషణ శోభన్ బాబు నటుడిగా తొలి సారిగా టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన చిత్రం ‘భక్త శబరి’. అయితే ముందుగా విడుదలైన చిత్రం దైవబలం. 1960 లో విడులైన భక్త శబరి చిత్రం 60 ఏళ్ళు పూర్తిచేసుకుంది. సుఖీభవ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బి.ఆర్.నాయుడు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి. భక్త శబరిగా టైటిల్ పాత్రను పండరీబాయ్ పోషించగా.. శ్రీరాముడిగా హరనాథ్, సీత గా రాజశ్రీ, లక్ష్మణుడిగా రామకృష్ణ ముఖ్యపాత్రలు పోషించగా… కరుణుడు అనే మునికుమారుని వేషం లో శోభన్ బాబు కనిపిస్తారు. ఇంకా నాగయ్య, చదలవాడ, మీనాకుమారి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
శ్రీరాముడు తన కోసం ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన పరమభక్తురాలు శబరిని చూడటానికి వస్తాడు. కానరాని కళ్ళని పులుముకొని చూసింది.చూపు కనపడలేదు. ఒళ్ళంతా కళ్ళయినట్టు… చేతులతో తడిమింది. ఆరాటంలో అడుగు తడబడినా మాట తడబడలేదు. ఆయన్ను ఆత్మీయంగా పిలిచి కాళ్ళు కడిగి, నెత్తిన నీళ్ళు చల్లుకుంటుంది. పూలు చల్లింది. అప్పటికే ఏరి దాచి ఉంచిన రేగుపళ్ళను తెచ్చియిచ్చింది. వగరుగా ఉంటాయేమోనని కలవరపడింది. కొరికి రుచి చూసి ఇచ్చింది. రాముడూ ఎంగిలి అనుకోకుండా ఇష్టంగా తింటాడు. శబరి ఆత్మీయతకి ఆరాధనకి రాముడు ముగ్దుడవుతాడు. జీవితమంతా ఎదురుచూపులతో గడిపిన శబరికి ఇంకో జన్మలేకుండా, గురుదేవులు వెళ్ళిన లోకాలకు వెళ్ళేలా వరం ఇస్తాడు. రాముని రూపం కళ్ళలో నిలుపుకొని పులకించి ఆవిధంగా పునీతమయింది శబరి. ఈ ఇతిహాస ఇతివృత్తాన్ని తనదైన శైలిలో తెరకెక్కించారు దర్శకుడు చిత్రపు నారాయణ మూర్తి. పెండ్యాల సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఏమి రామకథ శబరి పాట సినిమాకే హైలైట్ గా నిలిచిపోయింది.