చక్కటి చమత్కారం.. చురుకైన వ్యంగ్యం.. సునిశిత హాస్యం ఆయన రచనా శైలి. క్రమ శిక్షణ తో కూడుకున్న వ్యక్తిత్వం.. సమయానుకూలంగా వ్యవరించే నైజం ఆయన లక్షణాలు. పేరు డి.వి.నరసరాజు. ఆయన గురించి తెలిసినవారంతా.. సరస సంభాషణల రాజు అంటారు. చమత్కారం, వ్యంగ్యం గల డైలాగులు రాయడంలో నరసరాజు దిట్ట అయినా, బరువెక్కించే సంభాషణలు కూడా క్లుప్తంగా రాసేవారు. ఎప్పుడూ ఇస్త్రీ చేసిన తెల్లని పంచె, జుబ్బాతో, నిటారైన మనిషి కాబట్టి ఆకర్షించేవారు. అయితే, ఎక్కువగా ఆయనకి వాహిని, విజయ, ఎవియమ్‌ సంస్థలతోనే పరిచయం. వాటికి ప్రాధాన్యం ఇచ్చేవారు. సరదాగా కంపెనీలకి వెళ్లడం, కబుర్లు చెప్పడం ఆయనకి నచ్చేది కాదు. అవరమైతే ఎవరైనా కారు పంపితే వెళ్లేవారు. అందరూ ఆయన్ని ‘దర్జారాయుడు’ అనేవారు. ఫలానా తేదీకి పూర్తి స్క్రిప్టు రాసి వినిపిస్తాను అనేవారు నరసరాజు. అలాగే, అంత కచ్చితంగానూ ఉండేవారు. ఆయన మాటల్లో ఎప్పుడూ చక్రపాణి, నాగిరెడ్డి, కె.వి.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డి పేర్లే దొర్లేవి. వాళ్ల సంగతులు, విధానాలూ చెప్పేవారు.

నరసరాజు  రచనలో కృత్రిమత్వం కనిపించదు. సంభాషణలు కృతకంగా ఉండవు. అశ్లీలం, అసభ్యం ధ్వనించవు. హాస్యం బాగా పండిస్తారు. సాంఘికమే కాకుండా, పురాణం, జానపదం కూడా రాశారాయన. చదువుకుంటున్నప్పుడు తెలుగు ముఖ్య భాష గనక, భారత భాగవతాది పురాణాలు బాగా చదివారు. కొన్ని సినిమాలు: ‘భక్తప్రహ్లాద’, ‘గుండమ్మకథ’, ‘నాదీ ఆడజన్మే’, ‘రంగులరాట్నం’, ‘గృహలక్ష్మి’, ‘రాము’, ‘కోడలు దిద్దిన కాపురం’, ‘ఆలీబాబా నలభై దొంగలు’, ‘బడిపంతులు’, ‘తాతమ్మకల’, ‘శ్రీరంగనీతులు’, ‘బృందావనం’ మొదలైనవి. కారుదిదిద్దన కాపురం సినిమాకి దర్శకత్వం వహించారు. చెవిలో పువ్వు, మనసు మమత లాంటి చిత్రాల్లో పాత్రధారణ చేశారు. నేడు నరసరాజు శతజయంతి. ఈ సందర్భంగా ఆ మహా రచయితకు ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!