సినిమాలు అందరూ నిర్మిస్తారు, లాభాలార్జిస్తారు. కానీ విజయాలకు పొంగిపోయి.. అపజయాలకు కుంగిపోతే అలాంటి వారు సినీ రంగంలో నిర్మాతలు గా పనికిరారు. సినిమా హిట్టయినా.. సినిమా తీయాలి, ఫ్లాప్ అయినా సినిమా తీయాలి అనే మొండి పట్టుదల కలిగిన వారే ఈ సినిమా రంగంలో రాణించగలరు. అలాంటి ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాత మిద్దే రామారావు. సినిమా ఆయన పేషన్. సినిమా ఆయన ఊపిరి. అందుకే కొన్ని దశాబ్దాల కాలం పాటు … ఉత్తమ చిత్రాలతో టాలీవుడ్ వెండి తెరమీద పండు వెన్నెలలు కురిపించారు రామారావు. రాజ్యలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అద్భుతమైన ఎన్నో కుటుంబ కథా చిత్రాలు నిర్మించి ఉత్తమ నిర్మాత రామారావు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో జన్మించారు మిద్దేరామారావు. చిన్న తనం నుండే సినిమాలపట్ల ఉన్న ఆసక్తితో తన చదువును మధ్యలో మానివేసి సినిమా ఎగ్జిబిటర్‌గా మారారు. ఏకంగా తన గ్రామంలో సుష్మ అనే టూరింగ్ టాకీసును నిర్మించారు. ఒక దశాబ్దం పాటు సినిమా ప్రదర్శకుడిగా కొనసాగిన తరువాత సినిమా నిర్మాణ రంగంవైపు దృష్టిని సారించారు మిద్దే రామారావు . మొదట్లో తెలుగులో డబ్బింగ్ సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. వాటిలో జెమినీ గణేశన్ నటించిన కొండవీటి వీరుడు, జయశంకర్ నటించిన కక్ష శిక్ష తమిళ సినిమాలు, రాజ్‌కుమార్ నటించిన ప్రచండ వీరుడు అనే సినిమా కన్నడ సినిమా తెలుగులోకి అనువదించి విడుదల చేశారు. వాటిలో కాస్తంత లాభాలు అందుకున్న తర్వాత చంద్రమోహన్ హీరోగా, శ్రీదేవి కథానాయికగా, కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా నిర్మించిన పదహారేళ్ల వయసు సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయన నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఈ విజయం తర్వాత రామారావు శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్స్ అనే బ్యానర్‌పై సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. పదహారేళ్ల వయసు, గూండా, పల్లెటూరి మొనగాడు, చాదస్తపు మొగుడు, ఝాన్సీరాణి, సంపూర్ణ ప్రేమాయణం, నిండు నూరేళ్ళు, పండంటి జీవితం, ప్రేమ మూర్తులు, రామరాజ్యంలో భీమ రాజు, గుండమ్మగారి కృష్ణులు, నిప్పులాంటి మనిషి, పచ్చని కాపురం, భార్యలు జాగ్రత్త, మా ఊరి మగాడు, అత్తకు కొడుకు మామకు అల్లుడు లాంటి సినిమాలు నిర్మించారు. నేడు మిద్దే రామారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.