విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డా. యన్టీఆర్ నటించిన సూపర్ హిట్టు జానపద చిత్రం ‘విజయం మనదే’. రాజేంద్ర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యన్.సాంబశివరావు నిర్మాణంలో .. బి.విఠలాచార్య తెరకెక్కించిన ఈ సినిమా 1970, జూలై 15న విడుదలైంది. సరిగ్గా నేటికి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ సినిమా. బి.సరోజా దేవి కథానాయికగా నటించగా.. కైకాల సత్యనారాయణ, మిక్కిలినేని, ముక్కామల, శ్రీధర్, నగేశ్, బాలకృష్ణ (హాస్యనటుడు), దేవిక శాంతకుమారి, జ్యోతి లక్ష్మి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఘంటసాల మాస్టారు సంగీతం అందించగా.. అందులో ఎవరో పిలిచినట్టుంది, ఏలుకోరా వీరాధివీరా, ఓదేవి ఏమి కన్నులు లాంటి పాటలు అప్పటి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.
అధికార మదంతో పక్క రాజ్యాన్ని కబళించాలని చూస్తాడు ఒక దేశపు మహారాజు. అయితే ఒక యువకుడు తమ గ్రామంలోని ప్రజలందరినీ సైనికులుగా మార్చి.. ఆ శత్రురాజుపై దండెత్తడమే ఈ సినిమాకథ. విఠలాచార్య ట్రేడ్ మార్క్ నెరేషన్, ఆయన తరహా మాయాజాలానికి కొదవేలేదు. వీటూరి సంభాషణలు రాయగా.. హెచ్.యస్.వేణు ఛాయా గ్రహణం వహించారు.