ఆయనలో కాళిదాసు అంతటి కవి ఉన్నాడు. రామదాసు అంతటి గొప్ప భక్తుడూ ఉన్నాడు.  ఒక పక్క కామెడీ, మరో పక్క విలనీ పోషించే గొప్ప నటుడూ ఉన్నాడు. మంచి దర్శకుడూ కనిపిస్తాడు. పాత్ర ఏదైనా అందులో తన మార్క్ చూపిస్తాడు. తనదైన మ్యానరిజాన్ని ప్రదర్శిస్తాడు. పేరు తనికెళ్ళ భరణి. లేడీస్‌ టైలర్‌’తో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన 750 పైచిలుకు చిత్రాల్లో నటించారు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు.

ప్రముఖ నటుడు రాళ్లపల్లి ప్రోత్సాహంతో భరణి రచయితగా, నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగులు వేశారు. మేనరిజమ్‌లోనూ, సంభాషణలు పకలడంలోనూ ప్రత్యేకతని ప్రదర్శించే భరణి తెలుగు తెరపై గుర్తుండిపోయే ఎన్నో పాత్రల్ని పోషించి తెలుగు తెరకే ఆభరణమయ్యారు. శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌’ చిత్రంలో దొరబాబుగా, ‘శివ’ చిత్రంలో నానాజీగా, ‘వారసుడొచ్చాడు’ చిత్రం లో కొలంబస్ గా నటించిన తరువాత తనికెళ్ల భరణికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అవకాశాలు వరుసకట్టాయి. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘చెవిలో పువ్వు’, ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘అప్పుల అప్పారావు’, ‘బలరామకృష్ణులు’, ‘మొండిమొగుడు పెంకిపెళ్లాం’, ‘గాయం’, ‘మనీ’, ‘యమలీల’, ‘శుభలగ్నం’, ‘మనీ మనీ’… ఇలా ఆయన నæ ప్రయాణం దూసుకెళ్లింది. మరో పక్క రచనలోనూ తన ప్రావీణ్యం ప్రదర్శించారు భరణి. ‘కంచు కవచం’తో రచయితగా పరిచయమైన ఆయన ఆ తరువాత ‘శివ’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘చెట్టుకింద ప్లీడర్‌’, ‘శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూప్‌’, ‘స్వరకల్పన’ తదితర విజయవంతమైన చిత్రాలకి మాæలు సమకూర్చారు. ‘మన్మథుడు’, ‘ఒకరికి ఒకరు’, ‘సాంబ’, ‘మల్లీశ్వరి’, ‘గోదావరి’, ‘హ్యాపీ’ తదితర చిత్రాల్లో తనికెళ్ల భరణి పరిణతితో కూడిన పాత్రల్లో నటించారు. ‘మిథునం’తో దర్శకుడిగా కూడా విజయాన్ని అందుకొన్నారు భరణి. ‘సముద్రం’లో నటనకిగానూ ఉత్తమ ప్రతినాయకుడిగా, ‘నువ్వు నేను’లో నటనకి ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా, ‘మిథునం’కిగానూ ఉత్తమ మాటల రచయితగా, ‘గ్రహణం’ చిత్రంలో నటనకి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాల్ని అందుకొన్నారు. శివభక్తుడైన భరణి శివుడి లీలలపై ‘ఆటకదరా శివ’, ‘శభాష్‌ శంకర’ అనే పుస్తకాల్ని రచించారు. నేడు తనికెళ్ళ భరణి పుట్టిన రోజు. ఈ సందర్భాంగా ఆయనకి శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!