విశ్వవిఖ్యాత నటసార్వభౌమ్ డా. యన్టీఆర్ కెరీర్ లో కొన్ని ప్రత్యేకతలు కలిగిన చిత్రం ‘సూపర్ మేన్’. హాలీవుడ్ స్ఫూర్తితో చిత్రాన్ని తెరకెక్కించినా.. తెలుగులో వచ్చిన మొట్టమొదటి సూపర్ హీరో చిత్రంగా ‘సూపర్ మేన్’ చరిత్రకెక్కింది. లక్ష్మీ విష్ణు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్.గోపాల్ నిర్మించిన ఈ సినిమాకి వి.మధు సూదనరావు దర్శకుడు. 1980లో విడులైన ఈ సినిమా 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. జయప్రద కథానాయికగా నటించిన ఈ సినిమాలో  కైకాల సత్యనారాయణ, చక్రపాణి, అల్లు రామలింగయ్య, కాంతారావు , త్యాగరాజు, ఆర్జా జనార్ధనరావు, జగ్గారావు, ఆనందమోహన్, జయమాలిని, గీత, పండరీబాయ్.. తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. జమీందారు వంశానికి చెందిన రాజా … తన చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథ అవుతాడు. అయితే తన తల్లిదండ్రుల్ని తన కళ్ళముందరే చంపిన వారిపై పగతీర్చుకొనే శక్తి తనకిమ్మంటూ ఆంజనేయస్వామిని ప్రార్ధిస్తాడు. అప్పుడు ఆంజనేయుడు ప్రత్యక్షమై .. రాజాకు కొన్ని అతీత శక్తుల్ని  అనుగ్రహిస్తాడు. గాల్లో ఎగురుతూ .. ప్రమాదాల్ని ఆపుతూ.. దుష్టశక్తుల ఆట కట్టిస్తూ .. అందరి దృష్టిలోనూ సూపర్ హీరో అయిన రాజా.. చివరికి తన పగను ఎలా తీర్చుకున్నాడు అన్నదే మిగతా కథ. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలో… మబ్బుల్లో చంద్రమ్మా , చినుకూ చిటికేసింది, అట్టసూడమాక, వెచ్చని కౌగిట లాంటి పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.

 

Leave a comment

error: Content is protected !!