దర్శకధీరుడు రాజమౌళి మలిచిన విజువల్ వండర్ బాహుబలి సిరీస్ లో మొదటి భాగం ‘బాహుబలి : ది బిగినింగ్. మహేంద్ర బాహుబలిగా  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, భళ్ళాల దేవుడుగా  దగ్గుబాటి రానా పోటా పోటీగా నటించిన ఈ జానపద చిత్రం 2015, జూలై 10న విడుదలై అఖండ ఖ్యాతి గడించింది. అవంతికగా తమన్నా, దేవసేన గా అనుష్క కథానాయికలుగా నటించగా.. ఈ సినిమా ఘన విజయంలో ముఖ్యపాత్ర పోషించిన శివగామి పాత్రను రమ్యకృష్ణ పోషించి మెప్పించింది. ఇక ఈ సినిమాకి మరో ముఖ్యమైన పాత్ర కట్టప్ప ను  తమిళ నటుడు సత్యరాజ్  అద్వితీయంగా రక్తికట్టించాడు. మహిష్మతి రాజ్యానికి చక్రవర్తి అమరేంద్ర బాహుబలి అయిన తన తండ్రిని చంపి రాజ్యాన్ని హస్తగతం చేసుకొని తల్లి దేవసేనను బంధీని చేసిన భళ్ళాలదేవుడిపై  తనయుడు మహేంద్రబాహుబలి పగతీర్చుకొని తిరిగి తన రాజ్యాన్ని ఎలా దక్కించుకున్నాడు అనే కథ లో మొదటి భాగంగా ఈ సినిమా తెరకెక్కింది. అబ్బుర పరిచే గ్రాఫిక్స్, కీరవాణి అనితరసాధ్యమైన సంగీతం.. వీనులవిందైన పాటలు బాహుబలి చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ కే సవాల్ విసిరే రీతిలో కళ్ళు చెదిరే కలెక్షన్స్ సాధించి.. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించింది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో అనువదించబడి తొలి పాన్ ఇండియా చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ సినిమాతో ప్రభాస్ కు వరల్డ్ వైడ్ గా క్రేజ్ వచ్చింది. మొత్తానికి రాజమౌళి డైరెక్టోరియల్ వెంచర్ లో బాహుబలి కలికితురాయిగా నిలిచిపోయింది.

Leave a comment

error: Content is protected !!