ఆయన పాట తేనె జలపాతం నుంచి జాలువారి.. వినేవారికి వీనుల విందవుతుంది. ఆయన రాగాలాపన.. కొన్ని కోకిలల పెట్టుగా మారి.. మనల్ని కనికట్టు చేస్తుంది. ఏపాట పాడినా.. అది శ్రోతల మనసుల్ని రంజింపచేయడం.. రసహృదయుల్ని స్పందింప చేయడం ఆయన గొప్పతనం. భాష కానీ భాషలో ఎన్నో మంచి పాటలు పాడి.. తన పాటకి భాషతో పనిలేదని.. నిరూపించాడు. ఆ గాయకుడి పేరు ఉన్ని కృష్ణన్. ఈ పేరు వింటే చాలు.. మన మనసుల్లో కొన్ని మధురమైన పాటలు మెదులుతాయి.
కేరళలోని పాలక్కాడ్‌లో జన్మించిన ఉన్నికృష్ణన్ మద్రాసులో కేసరి కుటీరంలో నివసిస్తుంటారు. ఆయన తాత ఎన్.కేసరి పేరుగాంచిన ఆయుర్వేద వైద్యుడు. తెలుగులో గృహలక్ష్మి అనే పత్రికని నడిపారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీకాం పూర్తి చేసిన ఉన్నికృష్ణన్ 1987 నుంచి 94 వరకు ప్యారిస్ కన్ఫెక్షనరీ లిమిటెడ్ సంస్థలో పనిచేశారు. తరువాత ఉద్యోగం వదిలిపెట్టి పూర్తిస్థాయి గాయకుడిగా మారారు. విశిష్టమైన గళంతో దక్షిణాదితో పాటు, ఉత్తరాది శ్రోతల్ని కూడా ఉర్రూతలూగిస్తున్న గాయకుడు ఉన్నికృష్ణన్. తెలుగులో ‘ఇన్నాళ్లు ఏ మబ్బుల్లో దాగున్నావో..’, ‘ఎంతందంగా ఉందో…’, ‘నా పాటే హోయ్‌నా హోయ్‌నా’, ‘డాడీ కథ వినవా చెబుతాను, ‘రొమాన్స్ లో రిథమ్ , ఇప్పటికప్పుడు… ‘ఏమైందో ఏమో కానీ.. , ‘నీ నవ్వుల తెల్లదనాన్ని, ‘మధుర మధుర తర మీనాక్షి…’ ‘ఎందుకు చెంతకి.. తదితర గీతాల్ని ఆలపించి శ్రోతలకి చేరువయ్యారు. శాస్త్రీయ సంగీత గీతాలాపానలో ఆయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఆంగ్ల భాషల్లో పాటలు పాడారు. తొలి పాటకే జాతీయ ఉత్తమ గాయకుడిగా పురస్కారాన్ని అందుకొన్న ప్రతిభాశాలి ఉన్నికృష్ణన్. నేడు ఉన్ని కృష్ణన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ మధురగాన లోలుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే ఉన్ని కృష్ణన్…