ఆ దర్శకుడు  సూపర్ స్టార్స్ తో  ఎప్పుడూ సినిమాలు తీయలేదు. ఆయన సినిమాల్లోని నటులే సూపర్ స్టార్లు అయ్యారు. భారీ చిత్రాలు ఎప్పుడూ తెరకెక్కించలేదు. మామూలు చిత్రాలే భారీ చిత్రాలను తలదన్నే రీతిలో వసూళ్ళు సాధించాయి. ఆయన  సినిమాల్లో హీరోయిజం ఉండదు.. కథే హీరోయిజం చలాయిస్తుంది. ఆయన కథానాయికలెప్పుడూ గ్లామర్ ను ఒలికించరు. వారి నటనే సినిమాకి గ్లామర్ గానూ, అదే గ్రామర్ గానూ అలరారుతుంది. సూపర్‌స్టార్లు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, క్యారక్టర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరోయిన్లు జయప్రద, సరిత, సుజాత.. వంటి శిష్యగణాలను వెండితెరకు పరిచయం చేసిన ఆయన దక్షిణాది  చలన చిత్ర సీమకు ఓ కంఠాభరణం. ఆయన పాత్రలు మన చుట్టూ ఉన్న సమాజం నుంచే వస్తాయి. జీవితాల్ని ఆవిష్కరించడం, ఉద్వేగాలను పండించడమే ఆయన  విజయరహస్యం. ఆ మహాదర్శకుడి పేరు కె. బాలచందర్.

ఎమ్జీఆర్‌ ప్రోత్సాహంతో  ‘దైవత్తాయ్‌’ సినిమాకు తొలిసారి మాటలు రాసి, స్క్రీన్‌ ప్లే సమకూర్చారు బాలచందర్ . తర్వాత మధ్యతరగతి కుటుంబ నేపథ్యంలో ‘నీర్కుమిళి’ నాటకాన్ని స్వీయ దర్శకత్వంలో హాస్యనటుడు నాగేష్‌ని హీరోగా పెట్టి అదే పేరుతో సినిమాగా మలిచారు. బాలచందర్‌ ఈ సినిమాని దాదాపు ఒకే సిట్టింగులో చిత్రీకరించారు. సినిమా వినూత్నంగా ఉండటంతో సూపర్‌హిట్‌ అయ్యింది. అలా తొలి చిత్రంతోనే హిట్‌ దర్శకునిగా పేరుతెచ్చుకున్నారు బాలచందర్‌. తర్వాత ‘నానల్‌’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’ , ‘భామావిజయం’ , ‘అనుబవిరాజా అనుబవి, ‘ఎదిర్‌ నీచల్‌’, ‘తామరై నెంజం’ సినిమాలు వరుసగా వచ్చాయి. 1964లో కృష్ణన్‌ – పంజు దర్శకత్వంలో వచ్చిన ‘సర్వర్‌ సుందరం’ సినిమాకు బాలచందర్‌ నాటకం ఆధారం. ఈ సినిమా ఉత్తమ సంభాషణల రచయితగా బాలచందర్‌కి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. బాలచందర్‌ తెలుగు చిత్రసీమలో కూడా తనదైన ముద్ర వేశారు. ‘భలే కోడళ్ళు’ చిత్రంతో బాలచందర్ దర్శకుడిగా తెలుగు నాట అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘సత్తెకాలపు సత్తయ్య, బొమ్మా బొరుసా, అంతులేని కథ, మరోచరిత్ర, ఇది కథకాదు, గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, కోకిలమ్మ, 47 రోజులు, అందమైన అనుభవం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు, రుద్రవీణ’ లాంటి మరెన్నో అద్భుతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని  సైతం  అబ్బురపరిచారు. జాతీయ సమగ్రత కోసం నర్గీస్‌ దత్  పేరిట ఇచ్చే అవార్డులు బాలచందర్‌కు రెండుసార్లు దక్కటం విశేషం. 1987లో బాలచందర్‌ను ‘పద్మశ్రీ’ బిరుదు వరించింది. 1973లో తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ పురస్కారంతో సత్కరించింది. అక్కినేని అంతర్జాతీయ పురస్కారం కూడా బాలచందర్‌కు దక్కింది. 2010 సంవత్సరానికి భారతప్రభుత్వం బాలచందర్‌కు ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ అవార్డును బహూకరించింది. అలాంటి మహాదర్శకుడి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!