ఒకప్పుడు బాలీవుడ్ లో అతడు చాక్లెట్ బాయ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా  ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకుల మనసు దోచుకొని… ఆపై హీరోగా మారి.. మంచి మంచి సినిమాలతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. అతడి పేరు అతుల్ అగ్నిహోత్రి. ఒకప్పటి హీరోయిన్ రతి అగ్నిహోత్రి కి బంధువు, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు స్వయానా బావమరిది (చెల్లెలి భర్త ) అయిన అతుల్ తనదైన ఒక శైలిని క్రియేట్ చేసుకుని .. హీరోగానే కాకుండా..  మంచి దర్శకుడిగానూ, భారీ ప్రొడ్యూసర్ గానూ అవతరించాడు.

పంజాబీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అతుల్ అగ్నిహోత్రి.. అతి చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు. దాంతో కుటుంబ భారం తనపై పడింది. ఆ సమయంలోనే  రతి అగ్నిహోత్రి వాళ్ళింట్లో ఉంటూ.. సినిమాల్లో ప్రయత్నాలు చేసేది. అప్పుడే అతుల్ లో సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. రతి అగ్నిహోత్రి హీరోయిన్ అయిన వెంటనే అతుల్ కోరిక నెరవేరింది. ‘పసంద్ అప్నీ అప్నీ’ అనే చిత్రంతో అతుల్ అగ్నిహోత్రి బాలీవుడ్ లో బాలనటుడిగా ప్రవేశించాడు. ఆపై మరికొన్ని చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత ‘సర్’ (తెలుగులో గ్యాంగ్ మాస్టర్ గా రీమేక్ అయింది) చిత్రంతో హీరోగా బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేశాడు అతుల్. మొదటి చిత్రంతోనే మంచి విజయం అందుకున్న అతుల్ పలు చిత్రాల్లో అవకాశాలు అందుకున్నాడు. ఆసూ బనీ అంగారే, ఆతిష్, క్రాంతివీర్ , నారాజ్, చాచీ 420 లాంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.  ఆ తర్వాత హీరో పాత్రలు తగ్గి సెకండ్ హీరో పాత్రలు చేయడం మొదలు పెట్టాడు.  అదే సమయంలో అతుల్ రెండు చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా.. నాలుగు చిత్రాల్ని నిర్మించాడు. అందులో బావమరిది సల్మాన్ తో బాడీగార్డ్ , భారత్  చిత్రాలు నిర్మించి .. బాగానే లాభాలు ఆర్జించాడు. నేడు అతుల్ అగ్నిహోత్రి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

Leave a comment

error: Content is protected !!