సినిమాలంటే ఆయనకి ప్రాణం. సినిమాలు తీయడం ఆయనకి పేషన్. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమాలు తీయడం అంటే.. ఇంకా మక్కువ ఎక్కువ. అందుకే ఆయన నిర్మాణంలోని సినిమాలన్నీ మాస్ జనాన్ని, కుటుంబ ప్రేక్షకుల్ని భలేగా ఎంటర్ టైన్ చేశాయి. ఆయన పేరు కె.యస్.రామారావు. పర్టిక్యులర్ గా మెగాస్టార్ చిరంజీవితోనే ఎక్కువ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ గా ఆయన చాలా ప్రసిద్ధి చెందారు. అందులోనూ యండమూరి నవలా చిత్రాల స్పెషలిస్ట్ గానూ ముద్ర పడ్డారు.
విజయవాడ లోనే పుట్టి పెరిగారు కె.యస్. విద్యాభ్యాసం కూడా అక్కడే చేశారు. ఇరవై ఒక్క ఏళ్లు వయస్సులో విజయవాడ నుండి చెన్నై వెళ్ళారు. సినిమాల మీద ఆయన ఆసక్తి గమనించి కె. రాఘవేంద్రరావు తండ్రి కె.ఎస్. ప్రకాశరావు ఆయన్ని తన వద్ద దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పెట్టుకున్నారు. ఆయన వద్ద ‘బందిపోటు దొంగలు’, ‘విచిత్ర కుటుంబం’, ‘నా కుటుంబం’ అనే మూడు సినిమాలకు పనిచేశారు రామారావు. ఆ తర్వాత ఆయన తండ్రికి ఒంట్లో బాగా లేకపోవడంతో విజయవాడ తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత కె.యస్.రామారావు పుట్టనకనగళ్ అనే కన్నడ దర్శకుడి మీద అభిమానం ఉండటంతో ఆయన సినిమాని తెలుగులో అనువాదం చేశారు. అది ఫ్లాపయింది. కమల్‌హాసన్ అబిమాని కావడంతో ‘ఎర్ర గులాబీలు’ కొన్నారు. అది పెద్ద హిట్టయింది. అలాగే ఆయనదే ‘టిక్ టిక్ టిక్’ కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అదీ కూడా బాగా ఆడింది. ఆ తర్వాత ‘మౌనగీతం’ చేశారు. అది కూడా బాగానే ఆడింది. అలా డబ్బింగ్ సినిమాలతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు కెయస్ రామారావు . ఆ తర్వాత నెమ్మదిగా స్ట్రైట్ మూవీస్ కొచ్చారు. చిన్నప్పట్నించీ సాహిత్యం ఎక్కువగా చదివే అలవాటు వల్ల… ఆంధ్రజ్యోతిలో యండమూరి వీరేంద్రనాథ్ ధారావాహిక ‘అభిలాష’ చదువుతూ బాగుందనిపించి, దాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై సినిమాగా తీశారు. మొదటి ప్రయత్నమే సూపర్ సక్సెస్ అవడంతో ..చిరంజీవితో యండమూరి నవలలు వరుసగా తెరెకెక్కాయి. ఛాలెంజ్ , రాక్షసుడు, మరణమృదంగం లాంటి నవలా చిత్రాలు చిరుని మెగాస్టార్ ను చేశాయి. ఆ తర్వాత వెంకీతో నిర్మించిన చంటి చిత్రం బ్లాక్ బస్టర్ అవడంతో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మరింత ఎత్తుకు ఎదిగింది. ఆ తర్వాత ‘మాతృదేవోభవ’ సినిమా కూడా ఆ బ్యానర్ వేల్యూను బాగా పెంచింది.
ఈ మధ్యనే కె.యస్.రామారావు విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం నిర్మించారు. నేడు కె.యస్. రామారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కు శుభకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.