ఆయన కథాంశాలు ఆలోచింపచేస్తాయి. ఆయన సినిమాలు కదలకుండా కూర్చోబెడతాయి. ఆయన పాత్రలు వాస్తవికతను కళ్ళకు కడతాయి. ఆయన సినిమాల్లోని సన్నివేశాలు సహజత్వాన్ని ఆవిష్కరిస్తాయి. టోటల్ గా ఆయన సినిమాలు సామాజిక ఇతివృత్తాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయనే అన్నే మోహన్ గాంధి. టాలీవుడ్ లో ఆయన అత్యుత్తమ దర్శకుడు. ఆయన ఇంతవరకూ తీసిన సినిమాలన్నీ .. సమజానికి మంచి జరగాలని ఉద్దేశంతో తెరకెక్కించినవే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇప్పటివరకూ ఆయన 40కి పైగానే చిత్రాలు తెరకెక్కించారు.

విజయవాడలో జన్మించారు మోహన్ గాంధి. అక్కడే యస్.ఆర్.ఆర్, సి.వి.ఆర్ కళాశాలలో బిఎస్సీ చదివారు. ఉన్నత చదువుల కోసం మణిపాల్ లోని ఇంజనీరింగ్ విద్యలో చేరారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరక్కుండానే తిరిగి విజయవాడ వచ్చేశారు. ఆయన కజిన్ వెంకటరత్నం శోభన్ బాబుని కలవడానికి వెళ్ళేవారు. అప్పటికి శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో ఇంకా నిలదొక్కుకోలేదు. ఆయన  వీరి యోగక్షేమాలు కనుక్కొనేవారు. స్టేజీ నాటకాలు వేసిన అనుభవం ఉండటంతో సినిమాల పట్ల తన ఆసక్తిని వెంకటరత్నానికి చెప్పారు మోహన్ గాంధి.  వెంటనే ఆయన్ని హీరో శోభన్ బాబు దగ్గరికి తీసుకుని వెళ్ళారు వెంకటరత్నం . కానీ శోభన్ బాబు మరోసారి ఆలోచించుకోమన్నారు. మొదట ఎడిటింగ్ పట్ల తనకు ఆసక్తి ఉన్నదని శోభన్ తో చెప్పడంతో, ఎడిటింగ్ అంటే ఒక్క అంశానికే పరిమితమై పోతావు… దర్శకత్వ శాఖలో ప్రయత్నించు అని ఆయన సలహా ఇచ్చారు.  తనకి చిత్రసీమలో ఎవరూ తెలియదని, శోభన్ బాబే తనను రికమెండ్ చేయాలని గాంధీ అభ్యర్థించారు. హీరో శోభన్ బాబు ద్వారా తెలుగు చలన చిత్ర సీమలో 1967లో ప్రవేశించారు అన్నే మోహన్ గాంధి. అక్కినేని సంజీవి, పి.సుబ్రహమణ్యం, పి.సి.రెడ్డి, ప్రత్యగాత్మ, టి. రామారావు,  వి. బి. రాజేంద్రప్రసాద్ మొదలైన వారి వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు గ్రహించి 1977లో తొలిసారి నిర్మాత శ్రీ ఎ.వి.సుబ్బారావు నిర్మించిన అర్ధాంగి చిత్రానికి దర్శకత్వం వహించారు మోహన్ గాంధి. ఆ సినిమా బాగానే పోవడంతో .. ఆయన పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఆ తర్వాత ‘రౌడీ, టెర్రర్, భలే మిత్రులు, మంచి మనసులు, చినబాబు, వారసుడొచ్చాడు,  మౌనపోరాటం, కర్తవ్యం, పోలీస్ బ్రదర్స్, పీపుల్స్ ఎన్ కౌంటర్’ లాంటి చిత్రాలతో ఉత్తమ దర్శకుడు అనిపించుకున్నారు మోహన్ గాంధి. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!