అందమైన చిరునవ్వు, పడుచుదనపు చిలిపితనం, సొగసైన నటన, ముద్దులొలికే మాటలు ఆమె ప్రత్యేకతలు. నాజూకైన అందంతో.. సన్నజాజి తీగెలాంటి నడుముతో.. కవ్వించే చూపులుతో దక్షిణాది ప్రేక్షకుల్ని కనికట్టు చేసిన అలనాటి సుందరి మంజుల. ఆమె అప్పట్లో చాలా స్లిమ్ గా ఉండడం వల్ల తెలుగులోని అందరు అగ్ర కథానాయికులతోనూ ..వరుసగా సినిమాలు చేసే అవకాశమొచ్చింది.
మంజుల తెలుగులో ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమె పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే సినిమా ‘మాయదారి మల్లిగాడు’. హీరోయిన్గా ఆమెకు అది తెలుగులో తొలి సినిమా. ఈ చిత్రంతోనే ఆమె గ్లామర్ హీరోయిన్గా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు మంజుల. ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి. చెన్నయ్‌లోనే పుట్టి పెరిగిన మంజుల తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 100కిపైగా చిత్రాల్లో నటించారు. మంజుల, ఘట్టమనేని కృష్ణ జోడీ తెలుగులో విజయవంతమైన జంటగా పేరొందినది. 1970ల్లో మంజుల హీరోయిన్గా అగ్రస్థాయికి చేరుకున్నారు. అయితే 80వ దశకంలో హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో వైవిధ్యమైన సహాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని అలరించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్, విజయ్‌కుమార్, కమల్‌హాసన్, రజనీకాంత్ తదితరులతో కలిసి నటించారామె. నేడు మంజుల జయంతి. ఈ సందర్భంగా ఆ అందాలనటికి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.