సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ కు బంగారు బాట వేసిన చిత్రం ‘సాక్షి’. బొమ్మర్షి బాపు మలిచిన మొట్టమొదటి చిత్రంగా ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది. ముళ్ళపూడి వారి రాత, బాపు చేత కలగలిసిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అప్పటి ప్రేక్షకుల్ని  భలేగా అలరించింది. పిల్లిని ఒక గదిలో బంధించి హింసిస్తూ ఉంటే ..  కొద్ది రోజులకు దానిలో తెగింపు ఏర్పడి.. బంధించిన వారిపై పులిలా తిరగబడుతుంది. ఇదే కాన్సెప్ట్ తో సాక్షి చిత్రం తెరకెక్కింది. ముళ్ళపూడి వెంకటరమణ రాసిన కథను బాపు తనదైన శైలిలో చిత్రంగా మలిచి..  ఇలాంటి కథలతో కూడా సినిమాలు తీయొచ్చని నిరూపించారు. ఒక హత్యను కళ్ళారా చూసిన ఒక అమాయక యువకుడు.. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి.. అన్ని అవాంతరాల్ని అధిగమించి చివరికి కోర్టు లో సాక్ష్యం చెప్పడమే ‘సాక్షి’ చిత్ర కథ. ఈ సినిమా 1967లో విడుదలైంది. ఇప్పటికి 53 ఏళ్ళు పూర్తి చేసుకొన్న ఈ సినిమా పూర్తిగా ఔట్ డోర్ లో చిత్రీకరించిన తొలి చిత్రంగా చరిత్రకెక్కింది. ఈ సినిమా లో ఒక సీన్ కూడా స్టూడియో లో చిత్రీకరించకపోవడం విశేషం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని గోదావరి పరీవాహక ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. విజయనిర్మల కథానాయికగా నటించిన ఈ సినిమాలో విన్నకోట రామన్నపంతులు, అల్లు రామలింగయ్య, సాక్షి రంగారావు, తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించగా..  హంతకుడిగా జగ్గారావు తనదైన శైలిలో నటించి మెప్పించాడు. దర్శకుడిగా  బాపు తొలి ప్రయత్నంగా తెరకెక్కిన  ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతినిచ్చింది.

 

Leave a comment

error: Content is protected !!