ఆయన కుటుంబ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్. కుటుంబ కలహాలు ఎక్కుడుంటాయో అక్కడ హీరోగా వాలిపాతాడు. ఆయన సినిమా కథలెప్పుడూ ఒకే ఫార్మేట్ లో సాగుతాయి. ఉమ్మడి కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య తగవులు, అత్తా కోడళ్ళ వాదులాటలు, కీచులాటలు.. తండ్రీ కొడుకుల మధ్య ఇగో క్లాషెస్ లాంటివన్నీ ఆయన కథా వస్తువులు. అలాంటి సమస్యలకు తన సినిమాలతో .. పరిష్కార మార్గం చూపిస్తాడు కాబట్టే… ఆయన సినిమాలకు ఎప్పుడూ ఒక వర్గం ప్రేక్షకులు ఉండేవారు. ఆ నట దర్శకుడి పేరు విసు. అసలు పేరు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాథం.
కె.బాలచందర్ దగ్గర .. తనకి నటుడిగా అవకాశం వచ్చేవరకూ సహాయకుడిగా పనిచేశారు విసు. ‘కుడుంబం ఒరు కదంబం చిత్రంతో విసు నటుడిగా మారారు. సంసారం ఒరు మిన్సారం, కణ్మణి పూంగ, మనల్ కయిరు, డౌరీ కళ్యాణం, పుయల్ కడందభూమి, రాజతంత్రం, వాయ్ సొల్లిల్ వీరనడి, నాణయమిల్లాత్త నాణయం లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి సత్తా చాటుకున్నారు. ఇక విసు తెలుగులో కూడా ఆడదే ఆధారం, శ్రీమతి ఒక బహుమతి, ఇల్లు ఇల్లాలు పిల్లలు లాంటి చిత్రాల్లో నటించి ఆ తరహా చిత్రాల్లో తన ప్రతిభ ఎలాంటిదో ప్రూవ్ చేసుకున్నారు. అయితే మరో విశేషం ఏంటంటే.. ఆయన తమిళంలో పోషించిన చాలా పాత్రల్ని .. తెలుగులో గొల్లపూడి మారుతీరావు నటించి మెప్పించారు. ఇక సినిమాలతో పాటు విసు ఎన్నో తమిళ టీవీ ఛానల్స్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆ కార్యక్రమాలు విజయవంతం అవడానికి ఎంతగానో తోడ్పడ్డారు. నేడు విసు జయంతి. ఈ సందర్భంగా ఆ విలక్షణ నటుడికి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.