ఆయన ఒక చేత్తో కథల్ని, మరో చేత్తో సంభాషణల్ని అవలీలగా రాసిపడేసే రచనా సవ్యసాచి. ఆయన రాసిన ఎన్నో కథలు .. కమర్షియల్ గా సక్సెస్ సాధించి.. ఆయనికి ఎనలేని పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయి. అలాగే.. దర్శకుడిగా కూడా ఆయనది వేరే బాణీ. సామాజిక సమస్యల్ని ఇతి వృత్తాలు తీసుకొని.. ప్రేక్షకుల్లో ఆలోచనల్ని రేకెత్తించే స్థాయిలో ఆయన పలు చిత్రాల్ని తెరకెక్కించారు. వాటిలో ఎక్కువ శాతం సక్సెస్ సాధించాయి. ఇక .. ఆయన మంచి నటుడు కూడా. తనకి మాత్రమే సొంతమయ్యే ఓ సెపరేట్ స్టైల్ లో ఆయన నటన ఉంటుంది. ఆయన పేరు పోసాని కృష్ణ మురళి.
‘శ్రావణమాసం’, ‘ఆపరేషన్ దుర్యోధన’, ‘ఆపద మొక్కులవాడు’, ‘మెంటల్ కృష్ణ’, ‘రాజావారి చేపలచెరువు’, ‘జెంటిల్‌మేన్’, ‘దుశ్శాసన’ చిత్రాల్ని తెరకెక్కించి దర్శకుడిగా కూడా తనదైన ముద్రని వేశారు పోసాని . గుంటూరు జిల్లా పెదకాకానిలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన ఉన్నత విద్యని అభ్యసించారు. బీకామ్ చదివిన పోసాని.. పరుచూరి సోదరుల దగ్గర సహాయకుడిగా చేరారు. వాళ్ల దగ్గర పనిచేస్తూనే ప్రెసిడెన్సీ కాలేజీలో ఎమ్.ఫిల్ చేశారు. గాయం, రక్షణ, అల్లుడా మజాకా, ‘పవిత్రబంధం’, ‘తాళి’, ‘ప్రేమించుకుందాం రా’, ‘పెళ్ళి చేసుకుందాం’, ‘గోకులంలో సీత’, ‘శివయ్య’, ‘రవన్న’, ‘మాస్టర్’, ‘ఆహా’, ‘భద్రాచలం’, ‘ఎవడ్రా రౌడీ’, ‘జెమిని’, ‘రాఘవేంద్ర’, ‘పల్నాటి బ్రహ్మనాయుడు’, ‘సీతయ్య’, ‘భద్రాద్రిరాముడు’ ఇలా వరుసగా సినిమాలు రాసుకుంట వెళ్లారు పోసాని . ఆ తరువాత దర్శకత్వం కూడా చేశారు. ‘ధర్మక్షేత్రం చిత్రంతో తొలిసారి కెమెరా ముందుకొచ్చిన ఆయన క్రమం తప్పకుండా నటిస్తూ వచ్చారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నటుడిగానే కొనసాగుతున్నారు పోసాని. నేడు పోసాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.