పదిమందిని నవ్వించడం అంటే.. కామెడీ కాదు. కామెడీ చేయడం అంటే.. నవ్వులాటా కాదు. అదో యోగం. అందరికీ సాధ్యం కాదు. ఆ విద్యను బహుకొద్ది మంది మాత్రమే అలవోక గా ప్రదర్శించగలరు. అలాంటి వారిలో అల్లరి నరేష్ ఒకరు. అద్భుతమైన కామెడీ టైమింగ్ తో, విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో .. తమాషా డైలాగ్ డెలివరీతో అతడు పండించే హాస్యానికి పగలబడి నవ్వని వాడే ఉండడు. ఎంతైనా నవ్వుల దర్శకుడు ఇవివి తనయుడు కదా.. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ నరేష్ కూడా బాగా అలవడింది.
రాజేంద్రప్రసాద్ తర్వాత కామెడీకి ఆ స్థాయి హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన నటుడు… అల్లరి నరేష్. ఆయన తెరపై కనిపించాడంటే చాలు… ప్రేక్షకులకు కితకితలు గ్యారెంటీ. తొలి చిత్రం ‘అల్లరి’తోనే కడుపుబ్బా నవ్వించాడాయన. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారింది. 14 యేళ్ల వ్యవధిలోనే యాభై సినిమాల మైలురాయిని అందుకొన్నాడు. యేడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని నవ్వించడం అల్లరి నరేష్ శైలి. కామెడీలోనే కాదు… ‘నేను’, ‘డేంజర్’, ‘ప్రాణం’, ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘లడ్డూబాబు’ తదితర చిత్రాల్లో అల్లరి నరేష్ నటుడిగా కూడా సత్తా చాటారు. ‘సుడిగాడు’లో ఆయన పంచిన వినోదం పతాక స్థాయిలో ఉంటుంది. కొంతకాలంగా వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా… అతడి సినిమాల మీద అంచనాలు మాత్రం తగ్గడంలేదు. ‘గమ్యం’లో చేసిన గాలిశీను పాత్రకిగానూ ఉత్తమ సహయ నటుడిగా నంది పురస్కారాన్ని, ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారు. తన తండ్రి పేరుతో స్థాపించిన ఈవీవీ సినిమా పతాకంలో సోదరుడు ఆర్యన్ రాజేష్‌తో కలిసి ‘బందిపోటు’ నిర్మించారు. ప్రస్తుతం నాంది అనే సినిమాతో.. నరేశ్ తనలోని అసలైన నటుడ్ని మరోసారి వెలికి తీయబోతున్నాడు. నేడు అల్లరి నరేశ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే అల్లరి నరేశ్ …