యాంగ్రీ ఫేస్ .. యారోగెంట్ లుక్.. ఫ్యూరియస్ ఎక్స్ ప్రెషన్స్ .. వేరియస్ మేనరిజమ్స్  .. ఇవన్నీ ఒక్క మనిషిలోనే ఉంటే .. ఆయనే సురేష్ గోపి.  మోహన్ లాల్, మమ్ముట్టి తర్వాత మాలీవుడ్ లో అవతరించిన మూడో సూపర్ స్టార్ ఆయన. చిన్నచిన్నపాత్రలతో  హీరోగా ఎదిగి.. ఆపై యాక్షన్ హీరో గా మారి.. అంతకు మించిన రీతిలో పోలీసు పాత్రలకు పెట్టింది పేరయ్యారు సురేష్ గోపి. ఆయన నటించిన పోలీస్ చిత్రాల్లో పరాజయం పాలైన చిత్రాలు ఓ రెండు మూడుంటాయి.  సూపర్ హిట్టయిన చిత్రాలే అత్యధికం. ఆయన డైనమిక్ యాక్టింగ్ కు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మాలీవుడ్ లో.

సురేష్ గోపి పుట్టింది కేరళలోని ఆలప్పుళ (అలెప్పీ). పెరిగింది కొల్లం లో. అక్కడే జువాలజీలో మాస్టర్ డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమా అంటే ఒక పేషన్ . ఆ మక్కువతోనే .. ఆయన ‘ఓడయిల్ నిన్ను అనే చిత్రంలో బాలనటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేశారు.  ఆపై చిన్నచిన్న పాత్రలతో మాలీవుడ్ జనానికి దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో విలన్ గానూ, హీరోగానూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు గోపి. ఇక ఆయనకి స్టార్ డమ్ తెచ్చిపెట్టిన చిత్రం జోషి దర్శకత్వంలో వచ్చిన ‘తలస్థానం’ (తెలుగులో రాజధాని గా రీమేక్ అయింది). అందులో పోలీసాఫీసర్ గా సురేష్ గోపీ తన నట విశ్వరూపం చూపించారు. పర్టిక్యులర్ గా 90ల్లో ఆయన నటించిన ఏకలవ్యన్, మాఫియా, కమీషనర్, ఎఫ్.ఐ.ఆర్, పత్రం, లేలం లాంటి చిత్రాలు దుమ్మురేపడంతో ఆయన సూపర్ స్టార్ గా అవతరించారు. ఇప్పటికీ మాలీవుడ్ లో పోలీస్ చిత్రాలు చేయాలంటే.. సురేశ్ గోపీనే చెయ్యాలి అనే ముద్ర పడింది ఆయనకి. ఎన్నో డబ్బింగ్ చిత్రాలతో తెలుగువారికీ  దగ్గరయ్యారు సురేశ్ గోపీ. మలయాళంతో  పాటు  తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో దాదాపు 200 పైచిలుకు చిత్రాల్లో నటించిన సురేశ్ గోపీ.. ‘కళియాట్టం’ అనే చిత్రంలోని నటనకు నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. . నేడు సురేష్ గోపీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!