తాత త్రిపురనేని రామాస్వామి చౌదరి కవిరాజు. తండ్రి గోపీచంద్ తెలుగు కథల ప్రపంచానికే రారాజు. ఇక మనవడు .. ఆ ఇద్దరి ప్రతిభాపాటవాల్ని పుణికి పుచ్చుకొని , దాన్నే ఆస్థిపాస్తులుగా భావించి.. అదే వారసత్వంగా తలచి.. ముందుకు సాగుతున్నారు. హీరోగా, కేరక్టర్ ఆర్టిస్ట్ గా, డాక్యుమెంరీ మేకర్ గా.. వివిధ రంగాల్లో తన సమర్ధతను నిరూపించుకున్నారు. ఆయన పేరు త్రిపురనేని సాయిచంద్. శేఖర్ కమ్ముల ‘ఫిదా’తో 25 ఏళ్ళ తర్వాత తెలుగు తెరపై రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ క్రెడిట్ తో ఇప్పుడు మరిన్ని చిత్రాల్లో నటిస్తూ సత్తా చాటుకుంటున్నారు.
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన ‘మాభూమి’ చిత్రంతో తెలుగు చలనచిత్రరంగంలో నటుడిగా ప్రవేశించారు సాయిచంద్. అందులో రామయ్య పాత్రలో మరుపురాని నటనను కనబరిచారు. ఆ తర్వాత ‘ధర్మవడ్డీ, పెళ్ళీడు పిల్లలు, మంచు పల్లకి, ఆడావాళ్ళే అలిగితే, గుడిగంటలు మ్రోగాయి, ఈ దేశంలో ఒకరోజు, రంగులకల, విముక్తి కోసం, ఈ చదువులు మాకొద్దు, శివ, అంకురం’ మొదలగు తెలుగు సినిమాల్లో నటించారు. ఆపై .. నటనకు దూరమై మైత్రి కమ్యూనికేషన్స్ స్థాపించి కొన్నాళ్ళపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశాత్మక డాక్యుమెంటరీలు తీస్తూ ఢిల్లీలో గడిపారు. పాతికేళ్ళ విరామం తరువాత మళ్ళీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో నటుడిగా పున: ప్రవేశం చేశారు. నిజజీవితంలో బ్రహ్మచారి గా మిగిలిపోయిన సాయిచంద్, ఫిదా చిత్రంలో ఇద్దరు కూతుళ్ళ తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో మరో మంచి పాత్ర పోషించం శభాష్ అనిపించుకున్నారు. నేడు సాయిచంద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.