చక్కటి అందం.. అంతకన్నా అందమైన అభినయం.. చిరునవ్వు చిగురించే ముఖం…. మాటలో గాంభీర్యత ..  నడకలో హుందాతనం.. వెరసి శారద. ఒకప్పటి టాలీవుడ్ వెండితెరకు అభినయ ఊర్వశి ఆమె. అందరు అగ్రకథానాయకుల సరసన నటించి మెప్పించిన నట విశారద . తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో అవిశ్రాంతంగా సినిమాలు చేసింది. మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా, రెండు సార్లు ఫిలిం ఫేర్‌ అవార్డుల విజేతగా, ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు సైతం అందుకొని  చరిత్ర సృష్టించింది.

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు . అయితే… రచ్చ గెలిచిన తరువాతే ఇంట గెలిచిన సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది శారద. కావడానికి తెలుగు నటే… కానీ, మలయాళ చిత్రపరిశ్రమలో నభూతో నభవిష్యత్‌ అనదగ్గ మంచి పాత్రలెన్నో ధరించి…జాతీయ స్థాయి ఉత్తమ నటిగా విఖ్యాతి గాంచిన తరువాతే పుట్టిల్లయిన తెలుగు చిత్ర పరిశ్రమ ఆమె ప్రతిభకు పట్టాభిషేకం చేసింది. ఆమె మాత్రమే నటించగల పాత్రల్ని రచయితలు సృష్టించారు. ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి తెలుగువారి ఆదరాభిమానాలు చూరగొంది.  అపూర్వమైన తన నటనతో ప్రేక్షక జనాల కళ్లు తడిపేసింది.

‘తోబుట్టువులు, దాగుడు మూతలు, మైరావణ, మురళి కృష్ణ, శ్రీమతి, భక్త పోతన్న, చదువుకున్న భార్య, మన సంసారం, శ్రీ రామకథ, మనుషులు మారాలి, సంబరాల రాంబాబు, పసిడి మనసులు, సిసింద్రీ చిట్టిబాబు, చెల్లెలి కాపురం ,జీవిత చక్రం, సతీ అనసూయ, పగబట్టిన పడచు, అమాయకురాలు, కాలం మారింది, మానవుడు దానవుడు, శారద, విశాలి, మల్లమ్మ కధ, ఇదా లోకం, అభిమానవంతులు, ఊర్వశి, రాధమ్మ పెళ్లి, ప్రేమలు పెళ్లిళ్లు, పల్లె పడుచు, హారతి, దేవుడు చేసిన పెళ్లి, ఆడంబరాలు అనుబంధాలు, బలిపీఠం, జమీందారుగారమ్మాయి, వైకుంఠపాళి, సౌభాగ్యవతి, భారతి, నిమజ్జనం, సుప్రభాతం, మహాత్ముడు, దానవీరశూర కర్ణ, స్వర్గానికి నిచ్చెనలు, గోరింటాకు, కార్తీక దీపం, ప్రియబాంధవి, కెప్టెన్‌ కృష్ణ, సర్దార్‌ పాపారాయుడు, రాముడు పరశురాముడు, రాజాధిరాజు, మంగళ గౌరి, కోడళ్ళు వస్తున్నారు జాగ్రత్త, కలియుగ రావణాసురుడు, ధర్మచక్రం, న్యాయం కావాలి, ఓ అమ్మ కధ, జస్టిస్‌ చౌదరి, ప్రేమనాటకం, జగన్నాధ రధ చక్రాలు, స్వరాజ్యం, రఘురాముడు…లాంటి చిత్రాలు శారద కెరీర్‌కి వన్నె తెచ్చాయి. 2013 వరకూ ఆమె నటిస్తూనే ఉంది. ఎన్టీఆర్, మోహన్‌ బాబు చిత్రం ‘మేజర్‌ చంద్ర కాంత్‌’లో కీలక భూమిక పోషించింది. అగ్ర హీరోలందరి సరసన మంచి పాత్రల్లో రాణించిన శారద  ఆపై..  అమ్మగా, అత్తగా, అమ్మమ్మగా కూడా నటించింది. నేడు ఊర్వశి శారద పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ నట విశారదకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.


Leave a comment

error: Content is protected !!