గంభీరమైన ఆ కంఠం.. నవ్వులు పూయిస్తుంది. విచిత్రమైన ఆయన మేనరిజమ్స్ .. కితకితలు పెట్టడానికే పుట్టాయి. ఆయన పలికే లాంగ్వేజ్ .. వింత గొలిపే బాడీ లాంగ్వేజ్ కామెడీకి కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాయి. ఆయన పేరు మల్లికార్జునరావు. బట్టల సత్తిగాడు అంటే ఠక్కున గుర్తుపడతారు ప్రేక్షకులు. ఆ పాత్ర ప్రభావం అలాంటిది మరి. ఒకప్పుడు టాలీవుడ్ లో ఆయన తిరుగులేని హాస్య నటుడు.
టాలీవుడ్ లో ఎంత మంది హాస్యనటులున్నా తనకి మాత్రమే ప్రత్యేకమైన గళంతోనూ… హావభావాలతోనూ వినోదాలు పంచిన విలక్షణ నటుడు మల్లిఖార్జునరావు. 25 ఏళ్ల కాలంలో సుమారు 400 చిత్రాల్లో నటించిన ఘనత ఆయనది. ‘లేడీస్ టైలర్’, ‘హలో బ్రదర్’, ‘తమ్ముడు’, ‘బద్రి’, కొబ్బరి బొండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఏప్రిల్ 1 విడుదల, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, … ఇలా పలు చిత్రాల్లో ఆయన నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అనకాపల్లిలో లో జన్మించిన ఆయన ‘కిరాయి రౌడీలు’, ‘నాగమల్లి’ చిత్రాలతో ప్రయాణం ఆరంభించారు. ‘మంచుపల్లకి’, ‘రుస్తుం’, ‘అన్వేషణ’, ‘ప్రేమించు పెళ్లాడు’, ‘లేడీస్ టైలర్’ చిత్రాల తరువాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వంశీ, ఇవివి సత్యనారాయణ, యస్వీకృష్ణారెడ్డిలాంటి దర్శకులు మల్లికార్జున రావు కోసం ప్రత్యేకంగా విచిత్రమైన పాత్రల్ని డిజైన్ చేసేవారు. మల్లికార్జునరావు తెలుగుతో పాటు, తమిళం, మలయాళం భాషల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారు. ‘తమ్ముడు’లో నటనకిగానూ ఆయనకి ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది పురస్కారం లభించింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన పలువురు పేద నటీనటులకి తనవంతు సాయం చేశారు. నేడు మల్లికార్జునరావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మహా హాస్యనటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.