భారతీయ సినిమాను వేలుపట్టి నడిపించిన మహానుభావుడు ఆయన. తెలుగు తెరకు ఎన్నో క్లాసిక్స్ అందించిన దిగ్దర్శకుడు, గొప్ప నిర్మాత. ఆయన పేరు అక్కినేని లక్ష్మి వరప్రసాదరావు . షార్ట్ కట్ లో యల్వీ ప్రసాద్ అంటారు. భారతీయ సినీ చరిత్రలో ఏకంగా మూడు భాషల తొలి టాకీల్లో నటించిన ఏకైక నటుడు యల్వీనే కావడం ఒక రికార్డ్ . నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, థియేటర్స్ ఓనర్‌గా దక్షణాది సినీ రంగానికి దేశవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చారు ఎల్ వి ప్రసాద్. కింది స్థాయి నుండి ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగిన ఈయన సామాజిక సేవతో కూడ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
కష్టానికి నిలువెత్తు నిదర్శనం యల్వీ ప్రసాద్. చిన్నతనం నుంచీ చదువు మీద శ్రద్ధ పెట్టకుండా ఊరూరా తిరిగే నాటక కంపెనీలు, డ్యాన్స్ ట్రూపుల మీదే తన ధ్యాస నిలిపి … అదే తన శ్వాసగా పెరిగాడు. స్థానికంగా ప్రదర్శించే నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడాయన. మూకీలు ప్రదర్శించే ప్రతీ గుడారంలోనూ ప్రసాద్ హాజరయ్యేవారు. కేవలం వంద రూపాయలతో ముంబై మహానగరంలో ఒక అనామకుడిగా అడుగుపెట్టిన ఆయన.. ఆ రంగంలోనే తన పేరును చిరస్థాయిగా నిలుపుకుంటాడని అప్పుడు ఎవరూ ఊహించలేదు. హిందీ, తమిళ, తెలుగు కన్నడ వంటి పలు భారతీయ భాషలలో మొత్తం మీద 50 చిత్రాల వరకు ఆయన దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఇలా పలు విధాలుగా తన పాత్రను పోషించారు. 1949లో వచ్చిన ‘మన దేశం’ సినిమాతో ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసారు. అలాగే ఎన్.టి.ఆర్తో పాటు షావుకారు జానకి, సావిత్రి లాంటి గొప్ప నటులను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ఎల్.వి ప్రసాద్ సొంతం. ‘మిస్సమ్మ, పల్నాటి యుద్ధం, ద్రోహి, మనదేశం, సంసారం, షావుకారు’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన యల్వీ ప్రసాద్ ‘బొండం పెళ్ళాం’, ‘చదువుకున్న భార్య’, అమావాస్య చంద్రుడు ’ లాంటి చిత్రాలలో నటించారు. భారతీయ చిత్ర రంగానికి చేసిన సేవలకు ..ఆయన్ను దాదా సాహెబ్ పాల్కే అవార్డు వరించింది. నేడు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మహా దర్శక, నిర్మాతకు మూవీ వాల్యూమ్ ఘన నివాళులర్పిస్తోంది.