అందాల నటుడు శోభన్ బాబు హీరోగా నటించిన ఎమెషనల్ అండ్ సెంటిమెంట్ మూవీ ‘మహరాజు’. రాశీమూవీస్ బ్యానర్ పై యం.నరసింహారావు నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు విజయబాపినీడు. 1985లో విడులైన ఈ సినిమా 35 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సుహాసిని కథానాయికగా నటించిన ఈ సినిమాలో నూతన్ ప్రసాద్, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, శ్రీధర్, రాళ్ళపల్లి, సాయికుమార్, ఈశ్వరరావు, సుత్తివేలు, హరిప్రసాద్, జయమాలిని, మమత, శ్రీలక్ష్మి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన రాంబాబు.. తన తమ్ముళ్ళు, చెల్లెళ్ళ భవిష్యత్తు కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తాడు. ఆ క్రమంలో తన భార్యను కూడా పోగొట్టుకుంటాడు. ఒంటరిగా మిగిలిన అతడికి తన తోడబుట్టినవారి ఆదరణ కూడా కరువవుతుంది. చివరికి అతడి జీవితం ఏ మలుపు తిరిగింది అన్నదే ఈ సినిమా కథాంశం. జీవితంలోని వివిధ దశల్లో రాంబాబు జీవన ప్రయాణమే ‘మహరాజు’ చిత్రం. విజయబాపినీడు స్టైలాఫ్ కామెడీకి, సెంటిమెంట్స్ కు ఏమాత్రం కొదవ ఉండదు. చక్రవర్తి సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందులో ముఖ్యంగా కైలాస శిఖరాన కొలువైన స్వామి.. పాట అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పటికీ ఈ పాట.. ఏదో చోట మారుమోగుతునే ఉంటుంది.