తెలుగు తెరపై బాలనటిగా ప్రవేశించింది ఆమె . ఆపై కథానాయికగానూ మారింది. ఇప్పుడు ఆమె వయసు ఐదు పదులు దాటింది. అయినప్పటికీ.. అదే అందం .. అదే అభినయం. ప్రస్తుతం తల్లి పాత్రలకు, ప్రధాన పాత్రలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఆ నటీమణి పేరు తులసి. శంకరాభరణం, సీతామహాలక్ష్మి, చిల్లరకొట్టు చిట్టెమ్మ లాంటి చిత్రాల వల్లనే ఆమె టాలీవుడ్ లో లాంగ్ స్టాండ్ లో నటీమణిగా నిలబడగలిగింది.   తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లి గూడేనికి చెందిన అమ్మాయి తులసి. ఆమె  తల్లికి  సినీ నటీమణులు అంజలీదేవికి,  సావిత్రికి మంచి స్నేహితురాలు. అప్పుడే  తులసి చురుకైన పిల్ల అని గమనించి సినిమాల్లో బాగా రాణించగలదని అనుకున్నారు. ‘భార్య’ అనే  సినిమా నిర్మాత ఒక బాలనటి కోసం వెతుకుతుండగా, వాళ్ళు తులసి పేరు సజెస్ట్ చేశారు. అప్పటి నుంచీ  అనేక సినిమాల్లో బాలనటిగా తెరమీద కనిపించింది ఇక చిల్లరకొట్టు చిట్టెమ్మ సినిమాలో చిన్నప్పటి జయచిత్రగా నటించి మంచి పేరు తెచ్చుకుంది తులసి. ఆపై  సీతామహాలక్షి చిత్రముతో నలుగురి దృష్టిలోనూ పడింది. ఇందులో తులసి పాత్రపై మూడుపాటలు చిత్రీకరించడంతో ఈమెది ప్రధానపాత్ర అయ్యింది. ఆ సినిమా సూపర్ హిట్టవడంతో తులసికి ఆఫర్స్ వెల్లువ మొదలైంది. ఇక తులసి నటజీవితాన్ని మలుపుతిప్పిన చిత్రం శంకారాభరణం. ఆ  సినిమాతో తెలుగునాట ఇంటింటా ఆమె పోషించిన పాత్ర పేరు మారుమోగిపోయింది.

ఇక వయసుకొచ్చాకా..  తులసి నటించిన తొలిచిత్రం జంధ్యాల దర్శకత్వం వహించిన ‘ముద్ద మందారం’. ఈ సినిమాలో ప్రదీప్ మరదలుగా  నటించింది. ఆ తర్వాత నాలుగు స్థంబాలాట , శుభలేఖ , మంత్రిగారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో ద్వితీయ కథానాయకిగా నటించింది. ఆ సినిమాలు  విజయం సాధించటంతో తులసి ఒకటి అరా పాటలున్న చెల్లెలి పాత్రలకు బాగా సరిపోతుందనే ముద్ర పడింది. ఈ మూస చట్రంలోనుండి బయటపడటానికి పూజకు పనికిరాని పువ్వు వంటి స్త్రీ ప్రధాన సినిమాలలోనూ, శ్రీ కట్నలీలలు వంటి సినిమాలో గ్లామర్ పాత్రలు పోషించినా అవి విజయం సాధించలేదు కానీ మంచి నటీమణిగా పేరు తెచ్చుకుంది. తులసి ప్రస్తుతం హీరోలకు తల్లిగానూ, ప్రధాన పాత్రల్లోనూ నటిస్తూ.. తన అభినయ జీవితాన్ని కొనసాగిస్తోంది. నేడు తులసి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!