నటకిరీటి రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘సాక్షి’. గాయత్రి కళా చిత్ర బ్యానర్ పై .. పి.యన్.రామచంద్రరావు దర్శకత్వంలో, విజయ్ , వై.టీ.నాయుడు సంయుక్తంగా నటించిన ఈ సినిమా 1989లో విడుదలైంది. లిజీ, జయసుధ, రఘువరన్, గిరిబాబు, మల్లికార్జునరావు, గుండుహనుమంతరావు, పొట్టి ప్రసాద్, కల్పనారాయ్, నిర్మలమ్మఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్టైంది. నిరుద్యోగులైన ఇద్దరు యువకులు .. సొంతంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ క్రమంలో వారికి ఒక అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఒక రోజు ఆ అమ్మాయి తన ఇంట్లోనే హత్యచేయబడుతుంది. ఈ హత్యకేసు ఆ ఇద్దరు యువకుల పైనా పడుతుంది. చివరికి ఆ హత్యకేసునుంచి వారిద్దరూ ఎలా బైట పడ్డారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ఈ సినిమా నిజానికి ‘విట్ నెస్’ అనే మలయాళ చిత్రానికి రీమేక్ వెర్షన్. జయరామ్, జగతి శ్రీకుమర్, సురేష్ గోపి, పార్వతి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి విజి తంబి దర్శకుడు. మలయాళంలో హైయస్ట్ గ్రాస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది ఈ సినిమా. మలయాళ చిత్రానికి కొద్ది పాటి మార్పులు మాత్రమే చేసిన దర్శకుడు రామచంద్రరావు.. అదే బిగితో స్ర్కీన్ ప్లే ను రూపొందించి ఘన విజయం సాధించాడు.