టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోన్న సినిమా పేరు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. పృధ్విరాజ్ సుకుమారన్, బిజు మీనన్ పోటీ పడి నటించిన ఆ సినిమా రీమేక్ రైట్స్ ను సితారా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ కొనుగోలు చేసినప్పటినుంచి ఆ సినిమా మీద టాలీవుడ్ జనం దృష్టిపడింది. అమెజాన్ ప్రైమ్ లో సినిమా ఉండడంతో చాలా మంది ఆ సినిమాను చూసి ఆ చిత్ర దర్శకుడి పనితనానికి ముచ్చటపడ్డారు. ఆయన పేరు సచ్చి. మాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనొక పేరు మోసిన రచయిత. అలాగే మంచి దర్శకుడు, నిర్మాత కూడాను. ‘రన్ బేబీ రన్ , చేట్టాయీస్, అనార్కలి, రామ్ లీల, షెర్లాక్ టామ్స్ , డ్రైవింగ్ లైసెన్స్ , అయ్యప్పనుమ్ కోషియుమ్’ తదితర సూపర్ హిట్టు చిత్రాల సృష్టికర్త ఆయన.
గతకొంతకాలంగా.. గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతోన్న సచ్చి.. రీసెంట్ గా చట్టకు సర్జరీ చేయించుకున్నారు. దాని కారణం వల్లనే ఇటీవల ఆయనకు గుండెపోటు రావడంతో త్రిశూర్ లోని జూబిలీ మిషన్ హాస్పిటల్ కు తరలించారు. కాగా నిన్న ఆయన పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ లోనే తుది శ్వాసవిడిచారు. సచ్చి మృతికి దక్షిణాది చిత్ర పరిశ్రమ సంతాపం తెలియచేసింది.