చియాన్ విక్రమ్ సినీ కెరీర్ ను అనూహ్య మలుపు తిప్పిన చిత్రం ‘అపరిచితుడు’. సౌత్ ఇండియాలోనే గ్రేట్ డైరెక్టరయిన శంకర్ మలిచిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ .. 2005 లో విడుదలై.. తెలుగు , తమిళ భాషల్లో దుమ్మురేపేసింది. సరిగ్గా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమా .. నిజానికి తమిళంలో తెరకెక్కిన ‘అన్యన్’ (అన్యుడు) చిత్రానికి డబ్బింగ్ వెర్షన్. తన కళ్ళముందు జరుగుతున్న అన్యాయాలకు తీవ్రంగా చలించిపోయే ఒక నిజాయితీ పరుడు తనకు తెలియకుండానే.. తనలోని ఒక అపరిచితుడు ..  అవినీతి పరులకు, దుష్టులకు గరుడ పురాణాన్ని అనుసరించి రకరకాల శిక్షలు విధించి చంపుతుంటాడు. తనకి స్ప్లిట్ పెర్సనాలిటీ అనే ఒక మానసికమైన రోగం ఉందని తెలుసుకోలేని అతడు.. తను ప్రేమించిన అమ్మాయిని తిరిగి ఎలా దక్కించుకున్నాడన్నదే మిగతా కథ. నిజాయితీ పరుడైన రాముగా, రోమియో రెమోగా, అపరిచితుడుగా మూడు విభిన్నమైన పాత్రల్లో  విక్రమ్ అదరగొట్టేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇందులో చియాన్ విక్రమ్ నట విశ్వరూపం ప్రదర్శించాడు.  సదా కథానాయికగా నటించిన ఈ సినిమాలో , ప్రకాష్ రాజ్, నెడుముడివేణు, వివేక్, ఢిల్లీ గణేశ్, కొచ్చిన్ హనీఫా, నాజర్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. హారీశ్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. సిడ్నీ షెల్డన్ ‘టెల్ మీ యువర్ డ్రీమ్స్’ నవల  ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికీ భారతీయ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

 

 

 

Leave a comment

error: Content is protected !!