కఠోర క్రమశిక్షణ.. ఖచ్చితమైన సమయపాలన.. కథాకథనాల  మీద పట్టు… ఛాయా గ్రహణం మీద అపరిమితమైన అనుభవం… సినిమా మేకింగ్ మీద పేషన్. ఇంతటి  ప్రిన్సిపుల్డ్ గా ఉండడమే ఆయన విజయ రహస్యం. ఆయన అసలు పేరు జాస్తి ధర్మతేజ.  స్ర్కీన్ నేమ్ తేజ.  ఛాయా గ్రాహకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించిన ఆయన .. ఆపై దర్శకుడిగా మారి.. సత్తా చాటుకున్నారు. ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన తేజ ఆ ప్రయాణంలో 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

కలిగిన వారి కుటుంబంలో జన్మించిన తేజ ది నాలుగంతస్తుల పెద్ద ఇల్లు. తండ్రి జె. బి. కె. చౌదరి కొరియా, జపాన్ దేశాలకు బెరైటీస్, మైకా, తిరుమల నుంచి వెంట్రుకలు మొదలైనవి ఎగుమతి వ్యాపారం చేసేవారు. తేజ బాల గురుకుల పాఠశాలలో చదివారు. సినీ నటి జీవిత, నృత్య దర్శకురాలు సుచిత్ర చంద్రబోస్ ఈయన ఒకే తరగతిలో చదువుకున్నారు. దర్శకుడు శంకర్ ఈయనకు సీనియరు. తేజ తల్లి చిన్నతనంలోనే చనిపోవడంతో నాయనమ్మ పర్వతవర్ధనమ్మ పర్యవేక్షణలో పెరిగారు. ఆమె ఇతనికి రామాయణ, మహాభారత, భాగవతాలను కథలుగా చెప్పేవారట. తల్లి మరణం తర్వాత తండ్రి వ్యాపారం దెబ్బతినడంతో కుటుంబం రోడ్డున పడింది. బంధువులు తేజతో సహా ముగ్గురు పిల్లల బాధ్యతను తీసుకున్నారు. దాంతో తేజ బాబాయి ఇంట్లో ఉంటూ బతుకు తెరువు కోసం సినిమా ఆఫీసుల్లో చిన్న చితకా పనులు చేస్తుండేవారు. తర్వాత చెన్నై నుంచి హైదరాబాదు వచ్చారు. కొద్ది రోజులు పోస్టరు ఇన్ చార్జిగా పనిచేశారు తేజ. ఆ తర్వాత కెమెరా సహాయకుడిగా పనిచేశారు. దర్శకుడు టి. కృష్ణ ఆయన్ను బాగా చూసుకునే వారు. ఛాయా గ్రాహకులు రవికాంత్ నగాయిచ్, ఎస్. గోపాల రెడ్డి, మహీధర్ దగ్గర కొద్ది రోజులు సహాయకుడిగా పనిచేశారు తేజ . రాం గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడి శివ సినిమాకు మొదటి నుంచి చివరి వరకు అనేక విభాగాల్లో పనిచేశారు. వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి సినిమాతో ఛాయాగ్రాహకుడిగా మారారు తేజ. ఆ సినిమాకి ఆయన ఉత్తమ ఛాయాగ్రాహకునిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ  తర్వాత అదే హోదాలో అంతం, మనీ సినిమాలకు కూడా పనిచేశారు తేజ. ఇక  ఆయన ‘చిత్రం’ సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా అడుగుపెట్టారు. తొలి సినిమాతో ఘన విజయం సొంతం చేసుకోవడంతో .. వరుస అవకాశాలు అందుకున్నారు. ఆ క్రమంలో జయం, ధైర్యం, నువ్వు నేను, నిజం, ఔనన్నా కాదన్నా, 1000 అబద్ధాలు, నీకు నాకు డ్యాష్..డ్యాష్, కేక లాంటి చిత్రాలు తెరకెక్కించి దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. వరుస అపజయాలతో కొంత కాలం దర్శకత్వానికి విరామమిచ్చిన తేజ. . ‘నేనే రాజు నేనే మంత్రి’ , సీత చిత్రాలతో విజయం సొంతం చేసుకున్నారు. త్వరలోనే గోపీచంద్ తోనూ, రానా తోనూ రెండు సినిమాలు తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడిగా 21 ఏళ్ళు పూర్తి చేసుకున్న తేజకు అభినందనలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

 

 

Leave a comment

error: Content is protected !!