దివంగత యువనటుడు ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో హీరో గా  ఎంట్రీ ఇచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘చిత్రం’. గ్లామరస్ హీరోయిన్ రీమాసేన్ ఈ సినిమాతోనే టాలీవుడ్ కు పరిచయం అయింది.  తేజ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం కూడా ఇదే అవడం విశేషం. 2000, జూన్ 16న విడుదలైన ఈ సినిమా అప్పటి యువతను విశేషంగా ఆకట్టుకుంది. సరిగ్గా నేటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి చాలా విశేషాలున్నాయి. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమా పూర్తిగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ సినిమాలో .. పాటలు పాడిన వారందరూ యువ గాయనీ, గాయకులే.

రమణ (ఉదయ్ కిరణ్)ది ఒక మధ్య తరగతి కుటుంబం. రమణకు సంగీతమంటే ఆసక్తి. కాలేజీలో కొంతమంది స్నేహితులతో కలిసి ఒక బృందంగా సాధన చేస్తుంటాడు. తల్లితండ్రులు ఒక ప్రమాదంలో మరణించగా జానకి (రీమా సేన్), ఆమె ఆక్క అమెరికానుండి తిరిగి వచ్చి రమణ చదువుతున్న కాలేజీలో చేరతారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న జానకి, రమణలు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. జానకి గర్భవతి అవుతుంది. ఆధునిక యువతి అయిన జానకి గర్భం తొలగించటానికి ఒప్పుకోక పోవటంతో ఇబ్బందికరమైన పరిస్తితులలో ఇంకా కాలేజీలో చదువుతుండగానే అప్పటికప్పుడే పెళ్ళి చేసుకోవలసి వస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకొని ఒకింట్లో నివశిస్తుంటారు. పిల్లవాడిని పెంచుకుంటూ పరీక్షలకు చదువుకొంటూ ఉంటారు. కుటుంబ పోషణకు సంపాదించడానికి రమణ నానా ఇబ్బందులూ పడుతుంటాడు. మధ్యలో జానకిపై విసుక్కుటుంటాడు. రమణకు బిడ్డను అప్పగించి జానకి వెళ్ళిపోతుంది. ఈ కథకు అప్పటి యువత బ్రహ్మరథం పట్టడంతో ‘చిత్రం’ సినిమా టాలీవుడ్ ఘన విజయం సొంతం చేసుకుంది. ప్రేమకథా చిత్రాల్ని న్యూజెన్ యాంగిల్ లో ఎలా తెరకెక్కించాలో ఈ సినిమాతో టాలీవుడ్ కు చాటిచెప్పారు దర్శకుడు తేజ .

 

Leave a comment

error: Content is protected !!