ఈ లాక్ డౌన్ టైమ్ ను పలువురు సినీ సెలబ్రిటీస్ ఎక్కువగా తమ పిల్లలతో అల్లరి చేయడానికి, వారితో సరదాగా కబుర్లు చెప్పడానికి, వారి చిట్టి చిట్టి మాటల్ని విని మురిసిపోవడానికి చక్కగా వినియోగించుకుంటున్నారు. అలాంటి హీరోల్లో అల్లు అర్జున్ ముందువరుసలో ఉంటాడు. అతడికి తన కూతురు అర్హ అంటే ప్రాణం. వీలు చిక్కినప్పుడల్లా బన్నీ.. ఆ చిన్నారితో అల్లరి చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక విషయంలో అల్లు అర్జున్ తన మాటతో ఆమెను ఒప్పించాలని శతవిధాలా ప్రయత్నించాడు . కానీ నో యూజ్. ఆ చిచ్చర పిడుగు మాత్రం అసలు ఒప్పుకోను అంటూ తెగేసి చెప్పేస్తోంది.
ఇంతకీ బన్ని కోరుతున్నది.. ఆ అల్లరి పిల్ల ఒప్పుకోనని చెబుతోంది దేని గురించో తెలుసా? పెళ్లి గురించి. తాజాగా దీనికి సంబంధించి వీళ్లిద్దరి మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ నెట్టింట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ‘374వ ప్రయత్నం’ అంటూ ఈ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు అల్లు అర్జున్. ‘‘అర్హాలు.. నా బుజ్జి తల్లిలు.. నా బంగారు తల్లి.. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా నాన్నా?’’ అని ఆ వీడియోలో బన్ని తన కూతుర్ని ప్రశ్నించగా.. ‘‘నేను చేసుకోను’’ అని చెప్పి అర్హ తుర్రున పరిగెత్తడం నవ్వులు పూయించింది. అల్లు అర్జున్ గతంలోనూ ఇదే విధంగా అర్హాను ప్రశ్నించగా అప్పుడూ ఇలాగే జవాబిచ్చింది. ఇప్పుడు 374వ ప్రయత్నంగా అదే ప్రశ్న సందించగా మళ్లీ అదే జవాబిచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.