తమిళ సినీ ప్రియులకు ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా చెప్పుకొనే చిత్రం ‘పదునారు వయదునిలే’. భారతిరాజా మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో కోలీవుడ్ రికార్డుల్ని తిరగరాసింది. ఇళయరాజా సంగీత సారధ్యంలోని పాటలు .. ఇప్పటికీ శ్రోతల్నిఉర్రూతలూగిస్తున్నాయి. రజనీకాంత్ విలన్ గానూ, కమల్ హాసన్ హీరోగానూ, అందాల శ్రీదేవి కథానాయికగానూ నటించిన ఈ సినిమాను తెలుగులో ‘పదహారేళ్ళ వయసు’గా దర్శకేంద్రుడు రీమేక్ చేయగా.. ఇక్కడ కూడా దుమ్మురేపేసింది. ప్రస్తుతం సూపర్ హిట్ సినిమాను లేటెస్ట్ అధునాతన డాల్బీ సౌండ్ సిస్టంతో తెలుగు భాషలోకి అనువదించనున్నారట. ఇంకా సినిమాను డిజిటలైజ్ చేసి.. ఆల్బమ్ లోని అన్ని పాటలను మళ్లీ కొత్తగా ఆధునీకరించడం జరిగింది.
ఇక కొత్తగా విడుదల కానున్న ఈ సినిమాకు తెలుగులో ‘నీకోసం నిరీక్షణ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ముగ్గురు అగ్రనటుల అవార్డు విన్నింగ్ సినిమా.. త్వరలో సామాజిక మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన అనంతరం మరో అయిదు భాషల్లో డబ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సుప్రీమ్ ఆల్మైటీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా నిర్మాత బామా రాజ్ కణ్ణు స్పందిస్తూ.. ”ఎంతో మధురమైన అనుభూతిని కలిగించే ఈ సినిమా.. తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా 5 పాటలను విడుదల చేశాం. వాటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సుమారు 30 నిమిషాల నిడివి గల దృశ్యాలను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసి మీ ముందుకు తీసుకువస్తున్నాం” అని ఆయన వెల్లడించారు. ఇక మరి మరోసారి భారతిరాజ మ్యాజిక్ మళ్లీ మనముందుకు రానుందన్న మాట. ఈ వార్త తెలిసిన సినీ అభిమానులు చిత్రయూనిట్ కి థాంక్స్ తెలపడం విశేషం.