సూపర్ స్టార్ కృష్ణ నటజీవితంలో  మరపురాని చిత్రం ‘పల్నాటి సింహం’.  కౌముది ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై యం.యస్.రెడ్డి నిర్మాణ సారధ్యంలో .. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1985లో విడుదలైంది. సరిగ్గా 35 ఏళ్ళను పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. ‘పల్నాటి యుద్ధం’ చారిత్రక గాథనే సాంఘిక వాతావరణంలో చిత్రీకరించారని చెప్పొచ్చు. బ్రహ్మనాయుడు పాత్రను కాస్తంత  సవరించి, చరిత్రలో లాగా అతనికి తనయుడు బాలచంద్రుడు కాకుండా, తమ్ముడు ఉన్నట్టుగా కథను రూపొందించి రక్తి కట్టించారు పరుచూరి సోదరులు. నిజానికి ‘పల్నాటి సింహం’ చిత్రాన్ని రూపొందించాలని నిర్మాత ఎమ్మెస్ రెడ్డి, దర్శకుడు కోదండరామిరెడ్డి తలపెట్టినపుడు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన కృష్ణ, జయసుధ, రాధ, శారద, సత్యనారాయణ వంటి వారందరూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఎమ్మెస్ రెడ్డిపై అభిమానంతో వీరంతా ఎంతగానో సహకరించి ఈ చిత్రాన్ని సకాలంలో పూర్తయ్యేలా చేశారు.

ఇక ఈ చిత్రానికి పాటలను వేటూరి, రాజశ్రీతో పాటు ఎమ్మెస్ రెడ్డి కూడా రాశారు. చక్రవర్తి బాణీల్లో రూపొందిన పాటలన్నీ జనాన్ని అలరించాయి. వి.ఎస్.ఆర్. స్వామి ఛాయాగ్రహణం సినిమాను కనులవిందుగా తీర్చిదిద్దింది. ఈ సినిమా  నాలుగు కేంద్రాలలో అర్ధశతదినోత్సవం జరుపుకుంది. షిప్టు మీద ఓ కేంద్రంలో శతదినోత్సవం కూడా చేసుకుంది.  చిత్రం ఎలా ఆడినా, నిర్మాతకు మాత్రం మంచి లాభాలను చూపింది.. ‘పల్నాటి సింహం’ సినిమా పేరు వినగానే ఇందులో ‘చెన్నకేశవ స్వామి’పై రూపొందిన గీతాలే ముందుగా గుర్తుకు వస్తాయి. మొత్తం మీద ‘పల్నాటి సింహం’ చిత్రం కృష్ణ కెరీర్ లో మణిపూసలా నిల్చిపోయింది.

 

 

Leave a comment

error: Content is protected !!