తెలుగు తెరకు యాక్షన్ చిత్రాల్ని అలవాటు చేసిన దర్శకుడు ఆయన. డిష్యుం డిష్యుం.. అనే సౌండ్స్ తోనూ, పిస్తోళ్ళ మోతలతోనూ.. గుర్రపు డెక్కల చప్పుళ్ళతోనూ తెలుగు తెరను వీరలెవెల్లో మోతెక్కించిన ఘనత ఆయనదే. పేరు కే.యస్.ఆర్.దాస్. ఆయన దాదాపు తన తొలితరం కథానాయకులు, నటీనటులందరినీ డైరెక్ట్ చేశారు. తన శతాధిక చిత్రాల డైరెక్టోరియల్ కెరీర్ లో ఆయన సాధించిన సంచలన విజయాలు అన్నీ, ఇన్నీకావు. నాటి అగ్రహీరోలందరికీ అద్భుతమైన విజయాలందించిన దర్శకుడాయన.
శోభన్ బాబు ‘లోగుట్టు పెరుమాళ్ళ కెరుక’ చిత్రంతో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన దాసు అత్యధికంగా కృష్ణతోనే ఎక్కువ సినిమాలు తెరకెక్కించడం విశేషం. అప్పటి హీరోలు. ఒక్క అక్కినేని నాగేశ్వరరావు తప్ప ..ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి, శోభన్‌బాబు, రజనీకాంత్, విష్ణువర్ధన్… ఇలా అగ్ర కథానాయకులందరితోనూ చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు కేఎస్ఆర్ దాస్. తెలుగులో బాండ్ తరహా చిత్రాల్ని తీర్చిదిద్ది కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనది. కృష్ణ కథానాయకుడిగా తెరకెక్కించిన ‘మోసగాళ్లకి మోసగాడు’ వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో అనువాదమై తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. కృష్ణ కథానాయకుడిగానే 30 సినిమాల్ని తెరకెక్కించారు కె.ఎస్.ఆర్.దాస్. యాక్షన్ చిత్రాలతో మాస్ ప్రేక్షకులకి దగ్గర చేసి కథానాయకుల ఇమేజ్‌ని పెంచిన ఘనత దాస్ సొంతం. 67 తెలుగు చిత్రాల్ని, 20 కన్నడ చిత్రాల్ని, 1 మలయాళ సినిమా, 11 హిందీ సినిమాల్ని తెరకెక్కించి తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. అయితే దాస్ కేవలం యాక్షన్ చిత్రాలే కాకుండా.. గిరిజా కళ్యాణం, ఈనాటి బంధం ఏనాటిదో , భలే రాముడు లాంటి కుటుంబ కథాచిత్రాల్ని కూడ తెరకెక్కించి.. ఆ జోనర్లోనూ తన సత్తా చాటుకున్నారు. దాదాపు మిగతా అందరు అగ్ర హీరోలతోనూ సినిమాలు తీసిన కొండా సుబ్బరామ దాసు అనే కే.యస్ .ఆర్ దాసు తెలుగుతో పాటు కన్నడ లోనూ విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించి సత్తా చాటుకున్నారు. తెలుగు లో ఆయన ఆఖరి చిత్రం ‘నాగులమ్మ’. నేడు కె.యస్.ఆర్.దాస్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.