స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన హాఫ్ బీట్ హిట్ మల్టీస్టారర్  ‘వేదం’. సామాజిక సమస్యల్ని వెండితెరపై వండివార్చడంలో సిద్ధహస్తుడైన క్రిష్ జాగర్లమూడి దీనికి దర్శకుడు. 2010 లో విడుదలైన ఈ సినిమా నేటికి పదేళ్ళు పూర్తి చేసుకోవడం విశేషం.  అల్లు అర్జున్ తో పాటు మంచు మనోజ్ కూడా ఒక హీరోగా నటించిన ఈ మల్టీస్టారర్ లో కథానాయికగా దీక్షా సేథ్ నటించగా.. అందాల అనుష్క ఒక ప్రత్యేకమైన పాత్రతో అందరి మనసుల్ని దోచుకుంది. మనిషికి డబ్బే ప్రధానం కాదు. పక్కవారు బాధల్లో ఉంటే .. సహాయం చేసే మంచి మనసు కూడా ముఖ్యమని ‘వేదం’ చిత్రంతో అద్భుతంగా చెప్పాడు దర్శకుడు.

ఐదు ప్రధాన పాత్రలు .. వారిపై సాగే ఎమోషనల్ సీన్స్ తో ఈ సినిమా కథ సాగుతుంది. న్యూయార్క్ లో కాన్సెర్ట్ కోసం తపనపడే రాక్ స్టార్ వివేక్ చక్రవర్తి (మంచు మనోజ్ ), ప్రేమించిన అమ్మాయి కోసం ఫాల్స్ ప్రెస్టీజ్ కు పోయి డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించే కేబుల్ రాజు ( అల్లు అర్జున్), తన కిష్టం లేని వేశ్యావృత్తినుంచి స్వేచ్ఛా ప్రపంచానికి ఎగిరిపోతే ఎంత బాగుంటుందని కోరుకొనే సరోజ (అనుష్క) , చేసిన  అప్పు తీర్చలేక మధన పడిపోయే చేనేత కార్మికుడు రాములు (నాగన్న), కొన్ని సమస్యల వల్ల విదేశాలకు భార్యతో సహా వెళ్లిపోవాలనుకొనే రహీముద్దీన్ ఖురేషి (మనోజ్ బాజ్ పేయీ).. తమ తమ సమస్యల్ని పక్కనపెట్టి తీవ్రవాదులనుంచి దేశాన్ని కాపాడడమే ‘వేదం’ చిత్రం.  యం.యం.కీరవాణి సంగీత సారధ్యంలోని పాటలు ఈ సినిమాకే హైలైట్స్ గా నిలుస్తాయి. విమర్శకుల ప్రశంసలతో పాటు నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకొని అందరి మన్ననలు అందుకుంది ఈ సినిమా.

Leave a comment

error: Content is protected !!