ఆమె ఒక దేవకన్య. ఆ దివి నుంచి ఈ భువికి దిగివచ్చిన అందాల అప్సరస. చూపులు విరితూపులు .. నవ్వితే నవరత్నాలు దొరులు.. చక్రాల్లాంటి కళ్ళను అటు ఇటు తిప్పుతూ.. ఒక లుక్కిస్తే అప్పటి కుర్రకారుకు గుండెల్లో గుబులే. పేరు రంభ. పేరు కు తగ్గ అందం.. అందానికి తగ్గట్టుగానే అభినయం . నిన్నటి తరం ప్రేక్షకులకు తన గ్లామర్ తో అందాల విందిచ్చిన ఆమె దక్షిణాది తెరమీద ఒక్కప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్ . తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో లెక్కకు మించిన చిత్రాల్లో నటించి.. సత్తా చాటుకుంది.
విజయవాడలో పుట్టి పెరిగింది రంభ. ఆమె అసలు పేరు విజయలక్ష్మి ఈది. పాఠశాలలో చదువుతున్నప్పుడే దర్శకుడు హరిహరన్ దృష్టిలో పడిన ఆమె, మలయాళ చిత్రం ‘సర్గమ్’ (తెలుగులో ‘సరిగమలు’) లో తొలి అవకాశాన్ని అందుకొంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘ఆ ఒక్కటి అడక్కు’తో కథానాయికగా పరిచయమైంది. ఆ చిత్రంతోనే ఆమె పేరు రంభగా మారిపోయింది. ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, ‘భైరవద్వీపం’ తదితర చిత్రాల తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. ‘హలో బ్రదర్’, ‘బంగారు కుటుంబం’, ‘ముద్దుల ప్రియుడు’, ‘అల్లరి ప్రేమికుడు’, ‘అల్లుడా మజాకా’, ‘మాతో పెట్టుకోకు’ తదితర చిత్రాలతో కమర్షియల్ కథానాయిక అనిపించుకొంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, భోజ్‌పూరి, బెంగాలీ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. బుల్లితెరతోనూ ఆమె అనుబంధం ఏర్పరచుకొంది. పలు షోలకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఇంటింటికీ చేరువైంది. రంభ ఇంద్ర కుమార్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. రంభ ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది. నేడు రంభ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.