ఆయన ఆలోచనలు వెండితెరపై వెన్నెల సంతకాలు చేస్తాయి. ఆయన కళాత్మక దృష్ణి.. సెల్యులాయిడ్ పై అద్భుత సృష్టి అవుతుంది. ఆయన కథలు.. ప్రేక్షకుల మదిని తొలిచి గుండెను తడుపుతాయి. ఆయన చిత్రాల్లోని పాటలు .. ప్రతీ హృదయాన్ని తట్టిలేపుతాయి. ఆయన సినిమాల్లోని ప్రతీ పాత్రకు ప్రత్యేకత ఉంటుంది. అవి చిరకాలం ప్రేక్షకుల మనోఫలకంలో కొలువై ఉండిపోతాయి. ఆయన పేరు మణిరత్నం. దక్షిణాది సినీ దర్శకుల్లో ఆయన మణిపూస.
దర్శకుడిగా తొలి చిత్రం కన్నడ లో తెరకెక్కించిన ‘పల్లవి అనూ పల్లవి’తో పురస్కారం అందుకుని విజయపరంపర కొనసాగించారు మణిరత్నం. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆయన. తెలుగులో ఆయన తీసిన తొలి చిత్రం ‘గీతాంజలి’ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిందీ చిత్రం. అప్పట్లో తెలుగులో ఓ ప్రేమకథా చిత్రాన్ని ఎక్కువ మంది వీక్షించిన సినిమా అది. ఇక ‘రోజా’తో ప్రేమికుల మనసు దోచేశారు. దేశవ్యాప్తంగా చాలా భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇది ఆయనకు జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చింది. మణిరత్నం ప్రేమ కథలను దేశానికి పరిచయం చేసి అఖండ విజయం నమోదు చేసిన చిత్రం అది. తర్వాత దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ‘గాయం’ చిత్రానికి కథ రాసిందీ మణిరత్నమే. ‘బొంబాయి’ చిత్రంతో మంచి మెలోడీ హిట్టందుకున్నారు. భారత ప్రభుత్వం 2002లో ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. ఇప్పటి వరకు మణిరత్నం ఆరు జాతీయ అవార్డుల్ని కైవసం చేసుకున్నారు. ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులనూ అందుకున్నారు. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మణి సార్ . నేడు మణిరత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.