తీర్చిదిద్దిన ముఖం.. తీక్షణమైన కళ్ళు .. ఉగ్రమైన చూపు.. ఉరుమును తలపించే వాయిస్.. పిడుగులు కురిపించే యాక్షన్ .. సహజమైన యాక్టింగ్ .. వెరసి భానుచందర్. ఒకప్పటి టాలీవుడ్ తెరకు మార్షల్ ఆర్ట్స్ పరిచయం చేసిన హీరోల్లో భానుచందర్ ఒకరు. సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కొడుకైన భానుచందర్ చిన్నతనంలో తండ్రిలానే తానూ సంగీత దర్శకుడు కావాలనుకున్నారు. గిటార్ నేర్చుకుని అవలీలగా వాయించగలిగేవారు. భానుచందర్ నేషనల్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కొద్ది కాలం పాటు సంగీత దర్శకుడు నౌషాద్ దగ్గర సహాయకుడిగా పనిచేశారు. తల్లి కోరిక మేరకు నటుడు కావాలని యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో శిక్షణ పొందారు. అతను శిక్షణ పొందిన సంస్థలో ముందు బ్యాచిలో రజనీకాంత్, తరువాత బ్యాచీలో చిరంజీవి శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆయన అన్నయ్య అతన్ని మార్షల్ ఆర్ట్స్ లో చేర్పించాడు. అలా భానుచందర్ కరాటే లో కూడా శిక్షణ పొందాడు. అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించారు.
1978 లో బాపు ‘మనవూరి పాండవులు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు భానుచందర్. అందులో చిరంజీవితో తొలిసారిగా నటించిన హీరోగా భానుచందర్ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. కెరీర్ బిగినింగ్ లోనే బాపు, బాలచందర్, కే.రాఘవేంద్రరావు, కోడిరామకృష్ణ , బాలు మహేంద్రలాంటి మహా దర్శకులతో వర్క్ చేసిన భానుచందర్ నటనలో బాగా రాటుతేలారు. నాలుగు దశాబ్దాల కాలం పాటు తెలుగు తెరపై హీరోగా వెలిగిన భానుచందర్ .. తన ప్రతీసినిమాలోనూ తన ట్రేడ్ మార్క్ ఫైట్స్ ను మాత్రం వదల్లేదు. హీరో సుమన్ తో అత్యధిక చిత్రాల్లో నటించిన మరో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు భానుచందర్. కెరీర్ బిగినింగ్ లో కొన్ని సినిమాల్లో విలన్ గా నటించారు. మరికొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయితే కోడిరామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘గూఢచారి నెం.1’ మూవీలో మాత్రం భానుచందర్ పూర్తి స్థాయిలో కమెడియన్ గా నటించి.. అందులో కూడా తన సత్తా చాటుకున్నారు. ఇక భానుచందర్ ‘దేశ ద్రోహులు, ప్రేమించొద్దు ప్రేమించొద్దు’ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించి.. వాటికి సంగీతం కూడా సమకూర్చారు. నేడు భానుచందర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
FIRST BREAK – Hero Bhanu Chander | భానుచందర్ | Movie Volume
MY INSPIRATION – Artist Bhanu Chander