విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డా. నందమూరి తారకరామారావు సినీ కెరీర్ లో అద్భుతమైన కుటుంబ కథా చిత్రం ‘సంసారం’. అనిల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తాతినేని ప్రకాశరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1975, మే 28న విడుదలైంది. నేటికి సరిగ్గా 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈసినిమా అప్పట్లో అఖండ విజయం సాధించింది. జమున కథానాయికగా నటించిన ఈ సినిమాలో .. మిక్కిలినేని , కైకాల సత్యనారాయణ, గుమ్మడి వెంకటేశ్వరరావు, కొంగర జగ్గయ్య, అల్లు రామలింగయ్య, ప్రభాకరరెడ్డి , పద్మనాభం, మాడా వెంకటేశ్వరరావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి డైలాగ్స్ రాయగా.. తాతినేని చలపతిరావు సంగీతం అందించారు. మా పాప పుట్టిన రోజు, చిరు చిరు నవ్వుల.. ఒంటరిగా ఉన్నాము.. తీయ తీయని.. యవ్వనం పువ్వులాంటిది.. లాంటి పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని, సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించాయి.
నిజాయితీ పరుడైన ఉద్యోగి రాఘవరావు తన సంస్థ పట్ల , తన యజమాని పట్ల చాలా కృతజ్నతా భావం చూపుతూ.. అటు తన భార్యకీ మంచి భర్త అనిపించుకుంటాడు. అయితే తన కంపెనీలో కొన్ని చీడపురుగులున్నాయని తెలిసి.. వారి ఆట కట్టించే క్రమంలో తాను కూడా ఎదురు దెబ్బలు తింటాడు. చివరికి రాఘవరావు వారిని పోలీసులకు పట్టించడమే చిత్ర కథాంశం. రాఘవరావు గా యన్టీఆర్ నటన, ఆయన భార్యగా జమున అభినయం, కైకాల సత్యనారాయణ విలనీ .. ‘సంసారం’ చిత్రానికి హైలైట్స్ గా నిలుస్తాయి.