లాస్టియర్ ‘మహర్షి’ చిత్రంలోని పాత్రతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు అల్లరి నరేశ్. ఆ సినిమా తర్వాత అల్లరోడు ట్రాక్ మార్చేస్తాడనే రూమర్ కూడా వినిపించింది. దానికి తగ్గట్టుగానే నరేశ్ .. తాజాగా ‘నాంది’ అనే ఒక సినిమాలో హాఫ్ బీట్ రోల్ చేస్తున్నాడు. అల్లరి నరేశ్ కెరీర్ లోనే ఒక వైవిధ్యమైన పాత్రను ఇందులో చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ‘ప్రాణం, నేను, గమ్యం’ లాంటి చిత్రాల్లో అల్లరోడి నటనలో మరో కోణాన్ని చూసిన ప్రేక్షకులు .. ‘నాంది’ చిత్రంతో కూడా అదే స్థాయిలో ఆశ్చర్యచకితులవుతారని ఫిల్మ్ నగర్ టాక్. చిత్రీకరణ ఆల్మోస్ట్ చివరిదశకు చేరుకున్న ఈ సినిమా కు రీసెంట్ గా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు.
విజయ్ కనకమేడల అనే డెబ్యూ డైరెక్టర్ రూపొందిస్తోన్న ‘నాంది’ చిత్రం అల్లరి నరేశ్ 57వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకుంది. యస్వీ 2 ప్రొడక్షన్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు ఆటంకం ఏర్పడడంతో చిత్రం విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. మరి డబ్బింగ్ పనులు మొదలు పెట్టిన ఈ సినిమా బృందం విడుదల తేదీని ఎప్పుడు కన్ఫామ్ చేస్తారో చూడాలి.