ఆమె దక్షిణాది తెరకు ఒక వరం. ఆమె నటన ఇప్పటి తరం నటీమణులకు ఒక పాఠం. అత్యంత సహజమైన నటనతో .. విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో ..  గంభీరమైన గొంతుతో ఆమె తెరమీద చేసే సందడి అంతా ఇంతా కాదు.  తమిళ ప్రేక్షకులు ఆమెను ఆచ్చి (బామ్మ) అని ముద్దుగా పిలుచుకుంటారు. పేరు మనోరమ. దాదాపు వెయ్యి చిత్రాల్లో అభినయించిన నటీమణిగా 1985లోనే గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన ఆమె.. తన జీవిత కాలంలో మొత్తంగా 1500 పైచిలుకు చిత్రాల్లో నటించి.. ఎవరికీ సాధ్యంకాని రీతిలో దక్షిణాది సినీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.

ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 5 దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరించిన  అత్యుత్తమ నటి మనోరమ. తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఆమె సుపరిచితురాలు. 1960, 1970 దశకాలలో తమిళ వెండితెరను శాసించిన మనోరమ తమిళనాడులోని మన్నార్ గుడిలో జన్మించారు. మనోరమ అసలు పేరు గోపిశాంత. 12 ఏళ్ల చిన్న వయసులోనే నాటకరంగంలోకి అడుగుపెట్టిన ఆమె స్టేజ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. కరుణానిధి రాసిన ఎన్నో నాటకాలల్లో నటించారు. 1958లో రిలీజ్ అయిన ‘మాలైయిట్ట మంగై’ సినిమాతో తొలిసారిగా వెండితెర మీద కనిపించారు మనోరమ. తొలి సినిమాలోనే కామెడీ ఆర్టిస్ట్ గా పరిచయం అయిన ఆమె ఆ తరువాత ఎక్కువగా ఆ తరహా పాత్రలే చేస్తూ వచ్చారు. 1963లో వచ్చిన కొంజమ్ కుమారి సినిమాలో హీరోయిన్ గా నటించినా తరువాత కూడా కామెడీ పాత్రల మీదే దృష్టిపెట్టారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆచ్చిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోరమ సినీరంగంలో అయిదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పని చేశారు. తెలుగులో ఎన్టీఆర్‌, తమిళంలో ఎంజీఆర్‌, అన్నాదురై, కరుణానిధి, జయలలితతో కలిసి ఆమె పని చేశారు. 1980లో శుభోదయం సినిమాతో తెలుగు రంగంలోకి ప్రవేశించారు మనోరమ. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్ మెంట్ అవార్డు సాధించారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కళైమామణి బిరుదుతో సత్కరించింది. 2002లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఆమెను వరించింది. నేడు మనోరమ జయంతి. ఈ సందర్భంగా ఆ కళైమామణికి ఘన నివాళులర్పిస్తోంది  మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!