ఆయన ప్రకృతిలోని అణువణువును తనలోకి ఒంపుకుంటాడు. ఆకాశం అద్దంలో తన ముఖం చూసుకుంటూ మురిసిపొతాడు. మట్టివాసనను తన మనసుతో ఆఘ్రాణిస్తాడు. ఆర్ధ్రమైన అమ్మ పిలుపులోని కమ్మదనాన్ని… కొంటెతనపు పంచదార బొమ్మలోని చక్కదనాన్ని, ప్రేమలో పడడంలోని గొప్పదనాన్ని, చిలిపితనపు చివరి మలుపులోని తీయదనాన్ని, రుచిచూపడంలో ఆయనకు ఆయనే సాటి. పాటకి చక్కటి ప్లలవితో నగిషీ చెక్కి.. దానికి అందమైన చరణాల పూత పూయడం ఆయనకి పరిపాటి. ఎన్నో పాటలు ఆయన కమనీయ కలంలోంచి జాలువారి.. అధర కాగితాలపై మధుర సంతకాలు చేశాయి. ఆయన పేరు చంద్రబోసు. తెలుగు తెరను దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంపాటు తన పాటలతో వెలిగించిన ప్రతీభావంతుడు ఆయన.
వరంగల్ జిల్లాకు చెందిన చల్లగరిగ చంద్రబోసు స్వస్థలం. అక్కడే ప్రాధమిక , ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. హైద్రాబాద్ లోని జేయన్టీయూ లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేశారు. దూరదర్శన్ లో గాయకుడిగా రాణించాలనే ఆయన ప్రయత్నం ఫలించకపోవడంతో.. స్నేహుతుడి సలహామేరకు టాలీవుడ్ లో లిరిసిస్ట్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘తాజ్ మహల్’ లో ని మంచుకొండల్లోన చంద్రమా అనే పాటతో గీతరచయితగా సినీ రంగ ప్రవేశం చేసిన చంద్రబోసును కెరీర్ బిగినింగ్ రాఘవేంద్రరావు లాంటి దర్శకులు ఎంతగానో ప్రోత్సహించారు. అలాగే కీరవాణి , మణిశర్మ లాంటి సంగీత దర్శకులు ఆయన పాటల్ని అందమైన ట్యూన్స్ గా మార్చి ఆయన్ను టాలీవుడ్ లో ఖరీదైన గీతరచయితను చేశారు. ఈ తరం ప్రేక్షకుల్ని కూడా తనదైన పాటలతో అలరిస్తూ దూసుకుపోతున్నారు. చంద్రబోస్ టాలీవుడ్ లో గీతరచయితగా అడుగుపెట్టి నేటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ పాతికేళ్ళలోనూ కొన్ని వందల పాటలు రాశారు చంద్రబోస్ . ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.